ఎదురుచూపులకు చెక్ : నక్కలగండి, నార్లాపూర్​ నిర్వాసితులకు సర్కారు భరోసా

ఎదురుచూపులకు చెక్ : నక్కలగండి, నార్లాపూర్​ నిర్వాసితులకు సర్కారు భరోసా
  • మంత్రికి సమస్య వివరించిన ఎమ్మెల్యే
  • పునరావాసంపై స్పష్టతతో చిగురిస్తున్న ఆశలు

నాగర్​కర్నూల్,​ వెలుగు: 14  ఏండ్ల కింద మొదలు పెట్టిన ప్రాజెక్ట్​లో ముంపునకు గురవుతున్న గ్రామాలు, గిరిజన తండాలకు పునరావాసం ఎక్కడ కల్పించాలనే విషయాన్ని గత ప్రభుత్వం తేల్చకుండా ఇబ్బంది పెట్టింది. పునరావాసం కల్పించకుండా తండాలను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. ఈ తరుణంలో నక్కలగండి ముంపు నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్​ వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నక్కలగండి నిర్వాసితులతో పాటు ఐదు రోజుల కింద మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. 

ప్రాజెక్ట్​కు గేట్లు బిగిస్తే మర్లపాడు, కేశ్యపాడు తండాలు మునిగిపోతాయని వివరించారు. బాధితులకు మెరుగైన పునరావాసంతో పాటు  పరిహారం చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. ఇదిలాఉంటే మంత్రి జూపల్లి ఆదేశాలతో నార్లాపూర్​ రిజర్వాయర్​లో ముంపునకు గురయ్యే గ్రామాల్లో కలెక్టర్​ బదావత్​ సంతోష్​ పర్యటించారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా కల్పించారు. ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో నిర్వాసితులు, పరిహారం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో తిప్పలు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను గుండెల్లో పెట్టుకుంటామని అప్పటి సీఎం కేసీఆర్​​పలు సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ.. మెరుగైన పరిహారం, ప్యాకేజీలు, ఉద్యోగాలు అంటూ రైతులు, నిర్వాసితులకు ఏడేండ్లు కంటి మీద కునుకులేకుండా చేశారు. భూముల పరిహారం చెల్లింపులో ఆలస్యం, భూముల ధరలు తగ్గించి అవార్డు ప్రకటించడం, ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం గాలికి వదిలేశారు. దీంతో కల్వకుర్తి లిఫ్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​లోని నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్లు, డిండి ప్రాజెక్ట్​ కెనాల్స్, నక్కలగండి ప్రాజెక్టులో ముంపు నిర్వాసితులు ఏడేండ్లుగా పోరాడుతున్నారు.

నక్కలగండి గిరిజనుల అరిగోస..  

నల్గొండ జిల్లాకు తాగు, సాగు నీరందించేందుకు ఎస్ఎల్​బీసీలో అంతర్భాగమైన నక్కలగండి ప్రాజెక్ట్​ పనులను రూ.545 కోట్ల అంచనా వ్యయంతో 2009లో ప్రారంభించారు.7.64 టీఎంసీల కెపాసిటీతో నక్కలగండి రిజర్వాయర్  పనులకు  భూసేకరణ మొదలుపెట్టారు. భూసేకరణతో పాటు ప్రాజెక్టు పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. 

ప్రాజెక్టుకు గేట్లు బిగించడమే మిగిలింది. గేట్లు ఏర్పాటు చేస్తే గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అయితే భూసేకరణ చట్టం  ప్రకారం నక్కలగండి నిర్వాసిత రైతులకు న్యాయం జరగలేదు. నక్కల గండి ప్రాజెక్టు కింద 3,155 ఎకరాలు ముంపు బారిన పడితే, ఇందులో అచ్చంపేట నియోజకవర్గంలోని మన్నెవారిపల్లి, కేశ్యపాడు తండా, మార్లపాడు తండా పరిధిలో 2,361 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. మర్లపాడు తండాలో 243 కుటుంబాలు, కేశ్యతండాలో 108 ఫ్యామిలీలను గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షల పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొంటే, నిర్వాసితులు దానికి అంగీకరించలేదు. 

దీంతో నష్ట పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా భూములు, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను  రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్నెవారిపల్లి, కేశ్యతండా, మార్లపాడు తండాలోని భూముల వివరాలను ఆన్ లైన్  నుంచి తొలగించారు. పరిహారం రాక, రైతుబంధు అందక, చనిపోయిన వారికి రైతుబీమా రాక అన్ని విధాలుగా నష్టపోయారు. 2012లో ప్రకటించిన పరిహారాన్ని 2023లో ఇస్తామంటే ఏం చేసుకోవాలని గిరిజనులు ప్రశ్నించారు. అప్పుడే పరిహారం ఇచ్చి ఉంటే, ఎక్కడో కొంత భూమి కొనుక్కొని బతికే వాళ్లమని అంటున్నారు. ఇప్పుడు గజాల్లో కూడా భూమి దొరకదని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని హైకోర్టు, మానన హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

బాధితుల్లో ఆనందం..

భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం ఏండ్లుగా పోరాడుతన్నామని, ఈ దశలో ఎమ్మెల్యే, మంత్రి చొరవ తీసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపిస్తామనడం ఆనందంగా ఉందని గిరిజనులు చెబుతున్నారు. హైదరాబాద్​ పరిసరాల్లో పునరావాసం కల్పించి, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడెకరాల భూమిని ఇస్తే తమ భవిష్యత్​ భద్రంగా ఉంటుందన్న భరోసా ఉంటుందని అంటున్నారు.