కృష్ణా గేట్లు ఖుల్లా 

కృష్ణా గేట్లు ఖుల్లా 
  • ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద
  • ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా ప్రాజెక్టుల గేట్లు ఓపెన్​

హైదరాబాద్, వెలుగు: ఎగువన ఉన్న మహారాష్ట్ర, గుజరాత్​లో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులన్నీ తెరుచుకున్నాయి. కర్నాటకలోని ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల ప్రాజెక్టు వరకు గేట్లన్నీ ఖుల్లా అయ్యాయి. మొన్నటిదాకా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లో క్యుషన్ (వరద అంచనాలతో ఖాళీ పెట్టుకోవడం) పెట్టుకుని దిగువకు నీటిని విడుదల చేయగా.. ఇప్పుడు ఆ రెండు ప్రాజెక్టులు కూడా ఫుల్ కెపాసిటీతో ఉన్నాయి.

ఆయా ప్రాజెక్టుల నుంచి 1.75 లక్షల క్యూసెక్కుల వరకు వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కూడా ఫుల్ కెపాసిటీకి చేరుకున్నాయి. దీంతో ఈ సీజన్​లో మరోసారి ఆ రెండు ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. శ్రీశైలం నుంచి 3.85 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్​ నుంచి 3.11 లక్షల క్యూసెక్కుల మేర వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇటు గోదావరి బేసిన్​లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కడెం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు మినహా ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులకు ఇంత వరకు పెద్ద వరద జాడలేదు. ఎగువన గోదావరి బేసిన్​లో సరైన వర్షాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు చెప్తున్నారు.

అరేబియా సముద్రంలో ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో ఎగువన గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఆయా ప్రాజెక్టులకూ వరద ప్రవాహం పెరిగేందుకు ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు.