కేంద్ర జలశక్తి శాఖకు చేరిన ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఆయా నదుల బోర్డుల నియంత్రణలోకి రానున్నాయి. కేంద్రం నోటిఫై చేయగానే బోర్డుల జురిస్ డిక్షన్ అమల్లోకి రానుంది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఫైనల్ డ్రాఫ్ట్ జురిస్ డిక్షన్ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖకు పంపాయి. ఫైనల్ డ్రాఫ్ట్ ను పంపడానికి శనివారం వరకు గడువున్నా.. ఒక్క రోజు ముందే రెండు బోర్డులు ఆ ప్రక్రియను పూర్తి చేశాయి. నవంబర్ మొదటి వారంలో కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు జురిస్ డిక్షన్ కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది. జురిస్ డిక్షన్ ఏపీ అనుకూలంగా ఉండగా.. తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. అవసరమైతే న్యాయపోరాటం చేసైనా అడ్డుకోవాలని చూస్తున్నది. అందుకు అనుకూలంగా ఉండే మార్గాలను వెతికే పనిలో పడింది.
జ్యురిస్డిక్షన్ ఇచ్చే అధికారం కేంద్రానిదే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలు, వివాదాలు, ఇతరత్రా అంశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు), జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు)ను ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో భాగంగా రివర్ బోర్డులు ఏర్పాటైనా వాటికి పరిధి, అధికారాలు కల్పించలేదు. జ్యురిస్డిక్షన్ ఇవ్వాలని ఏపీ కోరుతుండగా, తెలంగాణ మాత్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. ఈ నెల 6న నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో జ్యురిస్డిక్షన్పై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ క్లారిటీ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం బోర్డులకు జ్యురిస్డిక్షన్ ఇచ్చే అధికారం కేంద్రానిదే అని తేల్చిచెప్పారు.
ఎత్తిపోసే నీళ్లన్నీ లెక్కలోకి
కృష్ణా, గోదావరి నదిపై రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ఆధీనంలో ఉండగా, జ్యురిస్డిక్షన్ను నోటిఫై చేశాక అవన్నీ సంబంధిత రివర్ బోర్డుల నియంత్రణలోకి వస్తాయి. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసే ప్రతి చుక్క నీళ్లు లెక్కలోకి వస్తాయి. ఏ ఔట్ లెట్ నుంచి నీటిని విడుదల చేయాలన్నా దానికి సంబంధిత రివర్ బోర్డు పర్మిషన్ తప్పనిసరి. బోర్డులకు జ్యురిస్డిక్షన్ ఇస్తే అది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు. అపెక్స్ భేటీలో జ్యురిస్డిక్షన్ ఇచ్చే అధికారం తమదేనని కేంద్ర మంత్రి చెప్తే.. సీఎం కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. బోర్డులకు జ్యురిస్డిక్షన్ ఇచ్చే చర్యలను ఆపేందుకు సుప్రీం కోర్టులో కేసు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
For More News..