హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాకు అన్ని శాఖల సహకారం అవసరమని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి అన్నారు. పీసీబీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ ఇలా ప్రభుత్వ శాఖలన్ని సహకరించినప్పుడే హైడ్రా లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుందని చెప్పారు. గొలుసుకట్టు చెరువులు, కాలువల పరిరక్షణ, పునరుద్ధరణకు తక్కువ ఖర్చుతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సోమవారం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పురుషోత్తం రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు.
సిటీ ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు అప్పగించిన టాస్క్ ను రంగనాథ్ వివరించారు. ఆ తర్వాత పురుషోత్తం రెడ్డి మాట్లాడారు. హైడ్రా వచ్చిన తర్వాత బఫర్ జోన్, క్యాచ్ మెంట్ ఏరియా వంటి వాటి గురించి ప్రజలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో అర్బనైజేషన్ వేగంగా జరుగుతోందని ఇందుకోసం మెరుగైన పట్టణ విధానాన్ని రూపొందించాలని కోరారు. చట్టాలను కచ్చితంగా అమలు చేసినప్పుడే భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవనాన్ని అందించగలమని వివరించారు. సిటీని కాపాడుకోవడం అందరూ బాధ్యతగా స్వీకరించాలని వెల్లడించారు.