ఆర్మూర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు షరతులు లేకుండా రూ.2 లక్షలు రుణమాఫీ, రెండు పంటలకు రైతు భరోసా రూ.15 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ఆర్మూర్ డివిజన్ పరిధిలో అన్ని తహసీల్దార్ఆఫీస్ల ముందు నిరసన ధర్నా నిర్వహించాలని ఆర్మూర్ రైతు ఐక్య కార్యచరణ కమిటీ పిలుపునిచ్చింది.
ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వి.ప్రభాకర్, ఇట్టెడి లింగారెడ్డి, దేగాం యాదాగౌడ్ మాట్లాడారు. గత ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతుల్ని మోసం చేసిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు 50 శాతం రుణమాఫీ చేయలేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 16న తహసీల్దార్ ఆఫీస్ ల ముందు జరిగే నిరసన ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బి. దేవారం, ఆకుల గంగారాం తదితరులు పాల్గొన్నారు.