మునగాల, వెలుగు : జిల్లాలో ఆయిల్ పామ్ తోటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వెంకట్‌రావు అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. గురువారం మునగాల మండలంలోని మాదారం, గణపవరం, మునగాల గ్రామాల్లో పర్యటించారు. మునగాలలో రిటైర్డ్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, మాధవరంలో రైతు బండి రమేశ్ డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను పరిశీలించారు.
గణపవరంలో రైతు వెంకటరెడ్డి సాగు చేస్తున్న డ్రాగన్ పంట సాగు పరిశీలించి మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట సాగు విధానం, సబ్సిడీలు, అంతర పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ యేడు 10, 500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు 2100 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారని వివరించారు. ఇప్పటికే 1100 పైగా మొక్కలు నాటారని, మిగిలిన రైతులకు కూడా ఈ నెలలో మొక్కలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
కోకా మొక్కలను ఎక్కువగా సాగులోకి తేవాలని వీటి కాయలు చాక్లెట్ తయారీలో వాడుతారని చెప్పారు. అనంతరం స్థానిక కనకదుర్గా ఫర్టిలైజర్ షాప్‌ను తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్ గౌడ్, అగ్రికల్చర్ ఆఫీసర్ రామారావు నాయక్, మునగాల తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆర్ఐ రాధ, ఏపీవో శైలజ ఉన్నారు.