బెట్టింగ్ యాప్స్‌ దందాలో సినీ స్టార్లు.. ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు

బెట్టింగ్ యాప్స్‌ దందాలో సినీ స్టార్లు..  ప్రమోట్ చేసిన  25 మందిపై కేసులు
  • నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ 
  • మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ 
  • పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మందిపైనా నమోదు   
  • లీగల్‌ సంస్థలనే ప్రమోట్ ​చేశాం: రానా, విజయ్‌
  • తప్పని తెలిసి ఆపేశాను: ప్రకాశ్‌రాజ్‌ 

హైదరాబాద్‌‌, వెలుగు: బెట్టింగ్ యాప్స్‌‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ యాప్స్‌‌ను ప్రమోట్ చేసినోళ్లలో పలువురు సినీ స్టార్లు కూడా ఉన్నట్టు తేలింది. వాళ్లపై సైబరాబాద్ కమిషనరేట్‌‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రెటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు.  

వీళ్లపై 318(4),112 రెడ్‌‌ విత్ 49 బీఎన్‌‌ఎస్‌‌3,3(ఏ), 4 తెలంగాణ స్టేట్‌‌ గేమింగ్ యాక్ట్‌‌, 66-డి ఐటీ యాక్ట్‌‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌‌ను ప్రమోట్​చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ 11 మందిపైనా మియాపూర్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో కేసులు నమోదు చేశారు. వీళ్లందరికీ త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు సమాచారం. 

యూత్‌‌ను బెట్టింగుల వైపు ప్రేరేపిస్తూ..

బెట్టింగ్‌‌లకు బానిసై, ఆర్థికంగా నష్టపోయి యువత ప్రాణాలు తీసుకుంటుండడంతో.. ఆ యాప్స్‌‌ను ప్రమోట్ చేస్తున్నోళ్లపై పోలీసులు సీరియస్‌‌గా దృష్టి పెట్టారు.  యాప్స్‌‌ను ప్రమోట్‌‌ చేసిన సెలబ్రెటీలపై శేరిలింగంపల్లి పొట్లపల్లి రెసిడెన్సీకి చెందిన ఫణింద్ర వర్మ అనే సామాజిక కార్యకర్త పోలీసులను ఆశ్రయించాడు. తమ కాలనీలోని యువత పెద్ద ఎత్తున బెట్టింగ్‌‌, క్యాసినోలో పెట్టుబడులు పెడుతున్నారని.. ఇందులో ఎందరో ఆర్థికంగా దివాలా తీశారని మియాపూర్​పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లో సెలబ్రెటీలు ప్రమోట్‌‌ చేసిన యాప్స్‌‌ వల్ల వారు ప్రభావితమయ్యారని అందులో పేర్కొన్నాడు. 

వారంతా కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని తెలిపాడు. తాను కూడా బెట్టింగ్ యాప్ చూసి ప్రభావితమయ్యానని, ఓ  బెట్టింగ్ వెబ్‌‌సైట్‌‌లో డిపాజిట్ చేయబోయానని పోలీసులకు వెల్లడించాడు. కుటుంబసభ్యులు హెచ్చరించడంతో బెట్టింగ్‌‌కు దూరంగా ఉన్నానని, లేకపోతే తాను కూడా నష్టపోయేవాడినని చెప్పాడు. సమాజానికి హాని కలిగిస్తున్న బెట్టింగ్, క్యాసినో యాప్స్‌‌, వెబ్‌‌సైట్‌‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు.

ఒక్కసారి ప్రమోషన్ చేస్తే రోజూ సంపాదనే..!

యువతను ఆకట్టుకునేందుకు ఢిల్లీ, కోల్‌‌కతా, బెంగళూరుకు చెందిన బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూట్యూబర్లు, టాలీవుడ్‌‌, బాలీవుడ్ నటులతో ప్రమోషన్​చేయిస్తున్నారు. దీని కోసం వారికి లక్షల్లో, కోట్లల్లో చెల్లిస్తున్నారు. ఒక్కో వీడియోకు ఇంత అని కూడా ఇస్తున్నారు. వారు ప్రమోట్‌‌ చేసిన వీడియోలను పలు సోషల్​మీడియా యాప్స్‌‌లో సర్క్యులేట్‌‌ చేస్తున్నారు. సెలబ్రెటీలకు లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్​ఉండడంతో బెట్టింగ్​యాప్స్​వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. 

సెలబ్రిటీలు బెట్టింగ్​యాప్స్​గురించి రెఫర్​చేస్తూ, తాము ఇచ్చే రిఫరెల్​కోడ్​వినియోగించి రిజిస్ట్రేషన్‌‌ చేయించుకుని జాయినింగ్‌‌ అయితే, బోనస్ వస్తుందని ఆశ పెడుతున్నారు. డిపాజిట్లపై ఇన్సెంటివ్‌‌, లాస్ పేమెంట్‌‌పై బోనస్ అంటూ చైన్‌‌ సిస్టమ్‌‌లో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఇలా వచ్చిన డిపాజిట్లపై కమీషన్లు కూడా సెలబ్రెటీల ఖాతాల్లోకి చేరుతున్నాయి. ఈ లెక్కన ఒక్కసారి చేసిన ప్రమోషన్‌‌కు ప్రతి రోజు రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతోంది. దీంతో వీడియోలు, పాప్-అప్ ప్రకటనల ద్వారా  జూదం, బెట్టింగ్, క్యాసినోలను ప్రోత్సహించేందుకు యూట్యూబర్లు, సెలబ్రెటీలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

స్కిల్డ్​ బేస్డ్​ గేమ్స్‌‌కే ప్రమోషన్.. 

చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌‌కు మాత్రమే విజయ్‌‌ దేవరకొండ ప్రమోషన్ చేస్తున్నారు. యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రమోటర్‌‌‌‌గా ఉన్నా.. ఆ కంపెనీని లీగల్‌‌గా నిర్వహిస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తాం. ప్రొడక్టుకు చట్టప్రకారం అనుమతి ఉందని వెల్లడైన తర్వాతే ప్రమోట్‌‌ చేస్తారు. అలాంటి ఏ23 అనే సంస్థకే విజయ్​బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌గా పనిచేశారు. ఆ సంస్థతో ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. విజయ్‌‌ దేవరకొండ టీమ్‌‌ 

లీగల్ వాటికే చేశారు.. 

స్కిల్​బేస్డ్​గేమ్‌‌లకు బ్రాండ్ అంబాసిడర్‌‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ గడువు 2017లో ముగిసింది. ఒప్పందానికి ముందు ఆయన లీగల్​టీమ్​ఇవన్నీ క్లియర్‌‌‌‌గా పరిశీలిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి లోబడి ఉన్న ప్లాట్‌‌ఫామ్ ప్రమోషన్లను మాత్రమే రానా అంగీకరించారు. సుప్రీంకోర్టు అనుమతులకు అనుగుణంగానే ఆయన ప్రమోట్‌‌ చేశారు. – రానా దగ్గుబాటి టీమ్‌
‌ 

ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు

చట్టవ్యతిరేకమైన బెట్టింగ్ యాప్స్, ప్రమోటర్లపై మియపూర్ పీఎస్‌‌లో కేసు నమోదు చేశాం. నిర్వాహకుల వివరాలు సేకరిస్తున్నాం. యాప్స్ నిర్వాహకులు, ప్రమోట్ చేసిన సెలబ్రెటీలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 2017 నుంచి  బెట్టింగ్స్ యాప్స్‌‌పై నిషేధం కొనసాగుతోంది. అలాంటి యాప్స్‌‌ గురంచి ప్రమోషన్లు చేస్తున్నారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాతే చట్టప్రకారం ముందుకెళ్తాం. ఇప్పటికి ఇంకా ఎవ్వరికీ నోటీసులు ఇవ్వలేదు.– వినీత్‌‌, డీసీపీ, మాదాపూర్‌‌‌‌


వీళ్లపైనే కేసులు.. 

దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్హసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు శేషయాని సుప్రిత. 

2022 నుంచి 797 కేసులు  

రాష్ట్రంలో క్రికెట్‌‌ బెట్టింగ్‌‌, ప్లేయింగ్ కార్డ్స్‌‌ సహా బెట్టింగ్‌‌ యాప్స్‌‌పై నిషేధం కొనసాగుతున్నది. వీటిని ప్రమోట్‌‌ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. 2022 నుంచి తెలంగాణవ్యాప్తంగా 797 కేసులు నమోదు చేశాం. పంజాగుట్ట, మియాపూర్‌‌‌‌ పీఎస్‌‌లో 25 మందిపై కేసులు నమోదు చేశాం. బెట్టింగ్ యాప్‌‌లను ప్రమోట్ చేస్తున్న దేశాలు వాటిని బ్యాన్ చేయాలని సూచించాం. శిఖాగోయల్‌‌, డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో

తప్పని తెలిసి తప్పుకున్నా.. 

2016లో యాడ్ చేసిన మాట వాస్తవమే. తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నాను. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు. కానీ యాడ్ ప్రసారం చేయవద్దని నిర్వాహకులను కోరాను.  ప్రస్తుతం ఎలాంటి గేమింగ్ యాప్‌‌కు పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ మరో కంపెనీకి అమ్మేశారు. కొత్త కంపెనీకి చెందిన నిర్వాహకులు సోషల్ మీడియాలో నా ప్రమోషన్స్‌‌ వాడారు. ఇందుకు వారికి లీగల్‌‌ నోటీసులు పంపించాను. నాకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పోలీసులకు వివరణ ఇస్తాను. - ప్రకాశ్‌‌రాజ్‌‌