- చైర్మన్‌ను దింపుతారనే ప్రచారంతో అధికారులపై ఒత్తిడి
- 450 మందితో ఫైల్ మూవ్ చేసిన పాలకవర్గం?
నల్గొండ, వెలుగు : నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘంలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు ఉద్యోగులకు ప్రమోషన్లతో పాటు పర్మినెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైల్‌ను ముందుకు కదుపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుత చైర్మన్ శ్రీకర్‌రెడ్డిని పదవి నుంచి దింపుతారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆగమేఘాలపై రాత్రికి రాత్రే ఆర్డర్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సోమవారం డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్‌రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు.
మహేందర్‌రెడ్డి శిష్యుడైన శ్రీకర్‌రెడ్డిని కూడా గద్దె దించేందుకు కాంగ్రెస్‌నాయకత్వం పావులు కదుపుతోంది. గతేడాది డెయిరీ పాలకవర్గం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో శ్రీకర్‌రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లగా స్టే రావడంతో శ్రీకర్రెడ్డే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మహేందర్‌రెడ్డి ఎపిసోడ్‌తో ఏ క్షణంలో అయినా శ్రీకర్‌రెడ్డి చైర్మన్ పదవి ఊడిపోతుదన్న భయం ఏర్పడింది. దీంతో ఉన్నఫళంగా డెయిరీలో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయడంతో పాటు, మరో 200 మందికి ప్రమోషన్లు ఇవ్వాలని ఫైల్పెట్టారు.
అయితే హైకోర్టులో కేసు నడుస్తుండడంతోపాటు జనరల్‌బాడీ, బోర్డు సమావేశం లేకుండా ఏకపక్షంగా ప్రమోషన్లు, పర్మినెంట్ఆర్డర్లు ఇవ్వడం కరెక్ట్ కాదని అధికారులు అంగీకరించడం లేద ని తెలిసింది. అయినా ఆర్డర్ ఇవ్వాల్సిందేనని వారిపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డెయిరీ నెత్తిన నెలకు రూ.60 లక్షల ఆర్థిక భారం పడుతోంది. రైతులు, ప్రైవేటు ఫర్మ్‌లకు కలిపి రూ.20 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఇది చాలదన్నట్టుగా కొత్తగా మరో రూ.4 కోట్లు అప్పుచేసేందుకు పాలకవర్గం సిద్ధమైంది. డెయిరీ భూముల రేట్లు పెరిగాయని చెప్పి వాటిని తాకట్టు పెట్టి కొత్త అప్పు చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో అక్రమంగా పదోన్నతులు, ఉద్యోగుల పర్మినెంట్చేయడం చెల్లుబాటు కాదని కూడా ఎండీ స్థాయి అధికారులు చెప్తున్నారు.