పాత జిల్లాల లెక్కనే ప్రమోషన్లు ఇవ్వాలి

టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత నిర్ణయం తీసుకున్నది. కానీ, కొత్త జిల్లాల ప్రాతిపదికన పదోన్నతులు ఇస్తారా? లేక పాత జిల్లాల ప్రకారం ప్రమోషన్లు కల్పిస్తారా? అనే విషయమై టీచర్లలో ఉత్కంఠ నెలకొన్నది. టీచర్​ పోస్టుల ఖాళీలు, సీనియారిటీ లిస్ట్​లను కొత్త జిల్లాలతోపాటు పాత జిల్లాల ప్రాతిపదికన సిద్ధం చేయాలని సీఎస్​ ఆదేశించడంతో విద్యా శాఖ అధికారులు జాబితాలను సిద్ధం చేసి పంపించారు. ఉమ్మడి ఏపీలో ప్రతి నెలా టీచర్లకు ప్రమోషన్లు కల్పించడంతోపాటు, ప్రతి ఏడాది ట్రాన్స్​ఫర్లు కూడా చేపట్టారు. 2014లో టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చింది. చివరిసారిగా 2015లో టీచర్లకు ప్రమోషన్లు కల్పించడంతోపాటు ట్రాన్స్​ఫర్లు చేపట్టారు. ఆ తర్వాత వాటి జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్లలేదు. ఈ అంశాలపై టీచర్​ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించ లేదు.

అయితే 2018లో టీచర్ల ట్రాన్స్​ఫర్లు చేపట్టారు. ఇతర శాఖల్లో పాత జిల్లాల ప్రకారం ప్రమోషన్లు కల్పించినప్పటికీ, టీచర్లకు మాత్రం ప్రమోషన్లు కల్పించింది లేదు. దీంతో వేలాది మంది టీచర్లు ప్రమోషన్లు పొందకుండానే రిటైర్​ అయ్యారు. ప్రమోషన్లు ఇవ్వని కారణంగా ఇంక్రిమెంట్ల విషయంలో చాలా మంది టీచర్లు నష్టపోయారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ దెబ్బతినడంతో పెండింగ్​లో ఉన్న పీఆర్‌‌సీని ప్రకటించాలని, ప్రమోషన్లు కల్పించాలని, ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయిస్, టీచర్ల​సంఘాలు ఆందోళన బాట పట్టడంతో సర్కారు దిగివచ్చింది. ఈ నెలాఖరుకల్లా కొత్త పీఆర్‌‌సీని ఇవ్వడంతోపాటు అన్ని కేటగిరీల్లో ప్రమోషన్ల ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. జీహెచ్‌‌ఎంసీ గ్రేడ్‌‌ 2, ఎల్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ పోస్టులను వందకు వంద శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనుండగా, స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ పోస్టులను ఖాళీల్లో 70% ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. మిగతా 30 శాతం స్కూల్​ అసిస్టెంట్​ పోస్టులను, ఎస్జీటీ పోస్టులను నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. పాత జిల్లాల ప్రకారం ప్రమోషన్లు కల్పిస్తే అందరికీ న్యాయం జరుగుతుంది.– రావుల రాజేశం, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి