సీఎం చొరవతోనే ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు

సీఎం చొరవతోనే ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు

పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎన్నో ఏండ్లుగా బదిలీలు, పదోన్నతులు కోసం ఎదురుచూసినా వారి ఆశలు నెరవేరలేదు.  గత ప్రభుత్వంలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గత పాలకులకు ఉపాధ్యాయులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఉపాధ్యాయ సంఘాల మాటలను కూడా పెడ చెవినపెట్టి ఉపాధ్యాయులను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనను కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తనే నిర్వహిస్తూ , ప్రత్యేకమైన చొరవతో  ఎలాంటి అడ్డంకులు లేకుండా సత్వరమే ఉపాధ్యాయ లోకానికి పదోన్నతులు బదిలీలు తప్పనిసరిగా పూర్తి చేయాలని సంకల్పించారు. 

ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఆ దిశగా అడుగులు వేయడం అభినందనీయం. కోర్టు కేసులను అధిగమించి ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు పదోన్నతులు బదిలీలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం,  షెడ్యూల్ విడుదల చేయడం,  కేడర్ వారీగా పాతిక రోజుల్లోనే పదోన్నతులను ఆ వెంటనే బదిలీలను పూర్తిచేసి ఉపాధ్యాయులను రేవంత్​ సర్కారు సంతోషపరిచింది. గత ప్రభుత్వం భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్​గా చేస్తానని మాట ఇచ్చి తప్పడం వారిని తీవ్ర నిరాశలోకి నెట్టి వేసింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేకమైన శ్రద్ధతో భాషా పండితుల కలలను సాకారం చేశారు. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులను ఇచ్చారు.  నిరుద్యోగులకు  డీఎస్సీ పరీక్ష తేదీలను ప్రకటించడం, ఆ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం  చొరవ చూపడం అభినందనీయం 317 జీవో ద్వారా స్థానికేతర జిల్లాలకు బదిలి అయిన ఉపాధ్యాయులను మళ్లీ సొంత జిల్లాలకు పంపించడానికి ప్రత్యేకమైన వెబ్ పోర్టల్​ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయం. 

- చంద్రకాంత్ గౌడ్, సిద్దిపేట