జూన్ 7 నుంచి టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు ..

జూన్ 7 నుంచి టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు  ..

 

  • 6 నుంచి బడిబాట
  • సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు
  • విద్యా శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నామని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇస్తామని ఆయన చెప్పారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్లు, బదిలీలు, ప్రమోషన్లకు అడ్డంకులు తొలగాయని, ఎన్నికల కోడ్  పూర్తికాగానే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 20 లోపు ప్రాసెస్​ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల6 నుంచి ప్రొఫెసర్  జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెడ్తామని వెల్లడించారు. 

ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్  రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అది సాధ్యం కాకపోతే.. విద్యా సంవత్సరం ప్రారంభం రోజు జూన్ 12న సీఎం పలు పాఠశాలలను సందర్శిస్తారన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, నోట్ బుక్స్  అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జిల్లాల్లోని పలు స్కూళ్లలో పాల్గొంటారని తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని పండగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 

సర్కారు బడుల వల్ల కలిగే లాభాలపై వివరిస్తం

సర్కారు బడుల్లో తమ పిల్లల్ని చదివిస్తే కలిగే లాభాల గురించి బడిబాట కార్యక్రమం ద్వారా పేరెంట్స్ కు వివరిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. పేరెంట్స్ కు ఫీజుల భారం ఉండబోదని, యూనిఫాం, పుస్తకాల ఖర్చు ఉండదని చెప్పారు. సర్కారు బడుల్లో క్వాలిఫైడ్  టీచర్లు ఉంటారని, ప్రైవేటు బడులతో పోలిస్తే సర్కారు విద్యా సంస్థల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని పేరెంట్స్ కు తెలియజేస్తామన్నారు.