భాషా పండితులకూ ప్రమోషన్లు ఇయ్యాలె..

భాషా పండితులకూ ప్రమోషన్లు ఇయ్యాలె..

టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇటీవల గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇది ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. భాషా పండిట్ల ప్రమోషన్​పై గతంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధాకరం. తెలంగాణలో దశాబ్దాలుగా గ్రేడు 2 భాషా పండితులుగా నియామకమై ఎలాంటి పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేస్తున్న దుస్థితి నేటికీ కొనసాగుతున్నది. ఏ శాఖలో లేనటువంటి వింత పరిస్థితి మాతృభాష పండితులది. ఉద్యోగంలో చేరిన తర్వాత కనీసం రెండు పదోన్నతులు పొంది పదవీ విరమణ చేయాల్సి ఉన్నా, అలా జరగడం లేదు. ఉద్యోగంలో నియామకమైనప్పుడు ఎస్జీటీకి సమానమైన స్థాయి అని చెప్పి, బోధన మాత్రం ఉన్నత తరగతులకు చెప్పిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ వెట్టి చాకిరే. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలల్లో  కేవలం స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఏడు సబ్జెక్టులను బోధించాలి. కానీ భాషా బోధన విషయంలో భాషా పండితులను మాత్రమే హైస్కూళ్లలో నియమించి, స్కూల్ అసిస్టెంట్ తో సమానమైన పనులు చేయిస్తూ, సహ ఉద్యోగులతో  చిన్నచూపు చూస్తున్నది విచిత్ర పరిస్థితి. ఉపాధ్యాయ హాజరు పట్టీలో అందరికంటే చివరన ఉండే పేర్లు పండితులవి. సెలవు రోజుల్లో10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన తరగతులు తీసుకుంటూ, మూల్యాంకనంలో కూడా స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పని చేస్తున్నా, డీఏ విషయంలోనూ అన్యాయం చేస్తూ ఎస్జీటీకి సమానంగా ఇస్తున్నారు. ఒకే బోధన, ఒకే పని కానీ హోదా, జీతం మాత్రం తక్కువ.

ఎన్నో ఏండ్లుగా..

భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్​ చేయాలని మంత్రులను, అధికారులను కలిసి విన్నవించుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషాభిమాని, స్వయంగా కవి అయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాతృభాషను బోధించే భాషా పండితులను పక్షం రోజుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేర లేదు. భాషా పండితుల ఒత్తిడి మేరకు 2021లో ప్రభుత్వం జీవో 2,3 లను ఇచ్చింది.  కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భాషా పండితులతోనే భర్తీ చేయాలనేది వాటి ఉద్దేశం. ఈ జీవోలను సవాల్ చేస్తూ  పీజీలో లాంగ్వేజ్​లను చదివిన ఎస్జీటీ టీచర్లు కోర్టులో సవాల్ చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాథమిక పాఠశాలలో పదివేల స్కూల్ అసిస్టెంట్లతో సమానమైన ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా, వారు కోర్టులో కేసు ఉపసంహరించుకోలేదు. ఇది కూడా భాషా పండితుల పదోన్నతులకు శరాఘాతంగా మారింది.

ప్రభుత్వం స్పందించాలి

ఏండ్లుగా బదిలీలు, ప్రమోషన్లు లేక భాషా పండితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బదిలీలపై ప్రకటన వెలువడటం ఆనందాన్ని ఇస్తున్నా, పదోన్నతుల విషయం మాత్రం ఇంకా బాధపెడుతూనే ఉన్నది.  హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్​నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ప్రధాన సంఘాలు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మరోసారి ప్రయత్నిస్తున్నాయి. హైస్కూళ్లలో బోధించే భాషా పండితులు ఓటర్లుగా ఉన్నందున మళ్లీ మభ్య పెట్టడానికి పండితుల పదోన్నతుల అంశాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి హడావుడి చేస్తున్నారు. అయితే కేవలం కోర్టు కేసు కారణంగా భాషా పండితులకు అప్​గ్రేడ్ పోస్టులు ఇవ్వడం లేదని చెప్పడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇకనైనా  ప్రధాన ఉద్యోగ సంఘాలు, అధికారులు భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ముఖ్యమంత్రి హామీ నెరవేరేలా కృషి చేయాలి.
- యాడవరం చంద్రకాంత్,
​సిద్దిపేట