కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద వానొస్తే కష్టమవుతోంది. టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మెయిన్‌రోడ్లు, కాలనీల్లో సరైన డ్రైనేజీలు లేక పెద్దవానలు కురిస్తే వరద రోడ్లపైనే నీళ్లు నిలుస్తున్నాయి. పట్టణంలోని పలు ఏరియాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నిత్యం జనాలతో రద్దీగా ఉండే ప్రధాన రోడ్లతో పాటు, పలు కాలనీల్లో రోడ్లు చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి.
టౌన్లో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. అందుకనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నా, ప్లానింగ్, పర్యవేక్షణ లేక పనులు పూర్తయిన మున్నాళ్లకే అవి శిథిలమవుతున్నాయి. టౌన్‌తో పాటు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను కలుపుకొని 49 వార్డులున్నాయి. జిల్లా కేంద్రంలో 12 కిలోమీటర్ల వరద కాల్వలు, 230 కిలోమీటర్ల అంతర్గత డ్రైనేజీలు, 180 కిలోమీటర్ల కచ్చా డ్రైనేజీ ఉన్నాయి. పట్టణంలో లక్షకు పైగా జనాభా నివసిస్తుండగా, నిత్యం వివిధ అవసరాల నిమిత్తం మరో 50 వేలకు పైగా జనం వచ్చిపోతుంటారు.
ఇదీ పరిస్థితి...
జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్‌చౌరస్తా, నిజాంసాగర్ రోడ్, స్టేషన్‌రోడ్, హైస్కూల్ రోడ్, సిరిసిల్ల రోడ్, సుభాష్‌రోడ్, తిలక్‌రోడ్, జేపీఎన్రోడ్డు కీలకమైనవి. ఈ ఏరియాల్లో వ్యాపార సంస్థలు అధికంగా ఉంటాయి. టౌన్లోకి రాకపోకలకు ఈ రోడ్లు ప్రధానమైనవి. ఈ ఏరియాల్లో చిన్నపాటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అది కూడా మూసుకుపోయింది. కొత్త బస్టాండ్‌నుంచి హౌజింగ్‌బోర్డు కాలనీ వరకు రోడ్‌కు రెండు పక్కల పెద్ద డ్రైనేజీతో పాటు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు చేస్తున్నారు. పనులు ప్రారంభించి 6 ఏండ్లు కావొస్తున్నా ఇప్పటికీ కంప్లీట్కాలేదు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక కొత్త బస్టాండ్ నుంచి వచ్చే వరద మొత్తం విద్యానగర్కాలనీలోకి వెళ్తోంది. ఇక్కడ ఇండ్ల మధ్య నీళ్లు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల రోడ్, స్టేషన్రోడ్లోనూ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. విద్యానగర్‌కాలనీ, జన్మభూమి రోడ్, ఎన్జీవోస్ కాలనీ, అశోక్‌నగర్ కాలనీల్లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతీ వానాకాలంలో వరద నీరు రోడ్‌పై నిలిచి ఇబ్బందులు పడుతున్నా, అధికారులు మాత్రం నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్. ఈ రూట్లో నిత్యం వేల సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు సాగిస్తాయి. రోడ్‌కు ఇరుపక్కలా దశబ్దాల కింద చిన్న డ్రైనేజీని నిర్మించారు. ప్రస్తుతం అది ముసుకుపోయింది. వానలు కురిస్తే రోడ్‌పైనే నీళ్లు నిలిచి చిన్నపాటి కుంటలను తలపిస్తాయి. దీంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వచ్చిన ప్రతీసారి ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్‌కు రెండు పక్కలా పెద్ద డ్రైనేజీ నిర్మించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
ఇది కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజూ వేలల్లో వాహనాలు అటుఇటు తిరుగుతాయి. ఈ రోడ్లో ఇందిరాచౌక్ నుంచి ధర్మశాల వరకు డ్రైనేజీ సరిగా లేదు. వానాకాలంలో రోడ్‌పైనే నీళ్లు నిలుస్తున్నాయి. అయ్యప్పగుడి ఏరియాలోనూ డ్రైనేజీ చిన్నగా ఉంది.