ఓటే.. వజ్రాయుధం

ఏ ఎలక్షన్‌‌ వచ్చినా క్యూలో నిలబడి ఓటు వెయ్యాలంటే చాలా మంది ఇష్టపడరు. ఎలక్షన్​ రోజు సెలవు వస్తే ఎంజాయ్​ 
చేద్దామని చూసే వారే ఎక్కువ మంది. పోలింగ్​ బూత్​కు వెళ్లే అవకాశం ఉన్నా అందుకు ఆసక్తి చూపించరు. దీని వల్ల 
తమకు జరిగే నష్టాన్ని వీరంతా గుర్తించడం లేదు. ఓటు హక్కును అసలు ఎందుకు పెట్టారన్నది కూడా ఆలోచించడం లేదు. ఓటు మన హక్కు మాత్రమే కాదు దేశంలో మనకంటూ ఉండే ఒక గుర్తింపు. ఆ గుర్తింపుతోనే ఓటు హక్కును సరిగ్గా 
వాడుకోవాలి. అప్పుడే సరైన నాయకులు, పాలకులు ఎన్నికై దేశ భవిష్యత్ ఉజ్వలంగా మారుతుంది. ఓటు హక్కును 
సక్రమంగా వాడుకుంటే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేశాన్ని గౌరవించినట్టు అవుతుంది.

రాజకీయ ప్రక్రియలోకి యువతను తీసుకువచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి నేషనల్​ ఓటర్స్​ డేను నిర్వహిస్తోంది. ఎలక్షన్​ కమిషన్​ ఏర్పాటైన జనవరి 25ను ఇందుకు కోసం ఎంపిక చేసింది. మనదేశంలో స్వాతంత్ర్యానికి ముందే, అంటే1920లోనే ఓటు హక్కును ప్రవేశపెట్టినా, చదువుకుని, తగిన ఫీజు చెల్లిస్తేనే ఆ హక్కును కల్పించే వారు. అయితే అప్పట్లో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు రావడంతో 1935 నుంచి మహిళలకు కూడా ఓటు హక్కును కల్పించారు. మనదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా దేశం మొత్తంగా పార్లమెంటు, అసెంబ్లీ పరంగా ఎన్నికలు మొదలైనవి 1952 నుంచే. రహస్య ఓటింగు ద్వారా ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే గొప్ప అవకాశం ఇప్పుడు మనకు లభించింది.

డబ్బు, మద్యం ప్రభావం

మనదేశంలో మొదట్లో అంటే 1952 నుంచి ఓటును నాయకులు, వాళ్ల తాతలు, తండ్రులు, వంశం పేర్లు చెప్పి ఓట్లు రాబట్టుకునే వారు. జవహర్​లాల్​ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఇలాగే చేశారు. గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పి ఓట్లు పొందేవారు. అంటే చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు. ఫలానా వాళ్లకు ఓటు వేయమని తండ్రి చెబితే కొడుకు వేయడం, భర్త చెబితే భార్య వేసేవారు. ఈ ప్రక్రియ దాదాపు 1980 వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎన్నికల్లో కొంత మార్పు వచ్చింది. డబ్బు, మద్యం ఎన్నికల ప్రక్రియలోకి ప్రవేశించాయి. నామినేషన్ల విత్​డ్రా నాటి నుంచి ఓటింగ్‌‌ జరిగే రోజు వరకు ఓటుకు డబ్బు పంచడం, మద్యం సీసాలు ఇంటింటికీ సరఫరా  చేయడం మొదలైంది. ఓ అభ్యర్థి ఓటుకు ఇంతని డబ్బుపంచితే, ఇంకో అభ్యర్థి ఇచ్చే డబ్బు తీసుకునేవారు కారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. అందుకే కోటీశ్వరులే ఎన్నికల బరిలో దిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ 2000 సంవత్సరం వరకూ యధేచ్చగా కొనసాగింది. 

ఎన్నికల్లో కులం పాత్ర

2000 తర్వాత డబ్బు, మద్యంతోపాటు కులం కూడా ఎన్నికల ప్రక్రియలోకి ఎంటరైంది. ఎన్నికల్లో ఈ మూడు కీలక పాత్ర పోషించడమే కాదు, కొంత వరకు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కుల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక్కడో పిట్ట కథ చెప్పుకుందాం. ఒక అడవిలో చెట్ల మధ్య ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఓ మర్రిచెట్టు.. తుమ్మచెట్టును అడిగిందట. ‘‘ఓ బావా నీవు ఎవరికి ఓటు వేశావు” అని. అప్పుడు తుమ్మచెట్టు ‘‘నేను గొడ్డలి గుర్తుకు ఓటు వేశాను” అని అందట. ‘‘అదేంటి బావా మనల్ని నరికేది, చంపేది గొడ్డలే కదా! దానికెందుకు ఓటేశావు” అని మర్రిచెట్టు అందట. అప్పుడు తుమ్మచెట్టు ‘‘నిజమే బావా.. గొడ్డలికి ఉన్న కామ తుమ్మది కదా! మా కులంది” అన్నదట. ప్రస్తుతం ఎన్నికల్లో ఇదే విధమైన కుల పిచ్చితో దేశం రగులుతోంది. రౌడీగా, నేరగాడిగా, అక్రమంగా డబ్బు సంపాదించిన కేసులు ఎదుర్కొంటూ ఉన్నా సరే, డబ్బు మద్యానికి, కులానికి ప్రాధాన్యం ఇచ్చి గెలిపిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టులాంటిది.

50 శాతం ఓట్లు రాకున్నా అధికారం

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి1984 వరకు, అంటే 37 ఏండ్లు జరిగిన ఎన్నికల్లో 50 శాతానికన్నా తక్కువ ఓట్లు పొందిన కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1984లోనే 67 శాతం ఓట్లు పొంది అధికారంలోకి వచ్చింది. అమెరికాలో 1977లో మూడు పార్టీలు పోటీలో ఉండి 40, 35, 25 శాతం ఓట్లు పొందాయి. అప్పుడు మన దగ్గరైతే 40 శాతం పొందిన పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, అమెరికాలో 40, 35 శాతం ఓట్లు పొందిన పార్టీలకు తిరిగి ఎన్నికలు పెట్టి 55 శాతం ఓట్లు పొందిన పార్టీ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించారు. కానీ మన దేశంలో పార్టీలు ఎక్కువ. రాష్ట్రాల్లో అయితే ప్రాంతీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటాయి. అందువల్ల 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చినా పరిపాలన చేస్తూ ఉంటారు. 

ఓటింగ్‌‌ శాతం పెరగాలంటే..

ఎన్నికల్లో ఓటింగ్‌‌ శాతం పెరగాలంటే ఒకటే మార్గం. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌‌పోర్ట్‌‌, భూమి ఉన్న వాళ్లకు పట్టాబుక్కులు, బ్యాంకులో అకౌంట్‌‌ ఉన్న వారికి పాస్‌‌ బుక్కులు ఉన్నట్లే ఎన్నికల్లో ఓటు వేయడానికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ‘ఓటరు బుక్కు’ ఇవ్వాలి. కల్యాణలక్ష్మి, రైతుబంధు, డ్వాక్రా రుణాలు, నిరుద్యోగ భృతి మొదలైనవి ప్రభుత్వం నుంచి పొందేటప్పుడు, వాళ్లు తమ ఓటును వాడుకుంటున్నారా లేదా అని పరిశీలించాలి. లేకపోతే అనర్హులుగా ప్రకటించాలి. ఈ పద్ధతి ప్రవేశపెడితే పోలింగ్‌‌ శాతం గణనీయంగా పెరగడమే కాదు, నూటికి నూరు శాతం ఓటింగ్‌‌ జరిగి తీరుతుంది. 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడు కుల, మత, వర్ణ, వర్గ, లింగ, జాతి, భాషా, ప్రాంత, సంస్కృతి, విశ్వాసాలు, ఆచారాలు, వివక్ష, అసమానతలు లేకుండా అందరూ సమానంగా వినియోగించుకునేదే ఓటు హక్కు. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి దగ్గర నుంచి.. మారుమూల గ్రామాల్లో ఉండే బీదవాడి వరకూ ప్రతి ఒక్క ఓటుకు ఉన్న విలువ ఒక్కటే. ఏది ఏమైనా మన చేతిలో ఉన్న వజ్రాయుధం ఈ ఓటు. దాని ద్వారా మనం బాగుపడొచ్చు. దేశాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు.

ఓటు వేయకపోతే..

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా 1952లో రహస్య ఓటింగు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. గ్రామ పరిపాలన కోసం సర్పంచ్, సభ్యులను, నగర ప్రాంతాల్లో కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు, పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపీలను ఓటు ద్వారా ఎన్నుకోవడం మొదలైంది. ఈ ఎన్నికలతో ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద లిబరల్ డెమొక్రసీ హోదాను పొందిందని చెప్పవచ్చు. అయితే 1952 ఎన్నికల్లో 35 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం దేశం మొత్తంలో సగటున 75 శాతం వరకు వచ్చింది. ఇది కొంత వరకు సంతోషించాల్సిన విషయమే. కొన్ని దేశాలలో అయితే ఓటు హక్కు తప్పనిసరి. ఓటు వేయకపోతే ఫైన్‌‌ కూడా విధిస్తున్నాయి. ఉద్యోగులనైతే సస్పెండ్ చేస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

-మునిగంటి శతృఘ్నచారి

కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘ