వైఎస్సార్ ఆస్తులు పంచలేదు-విజయమ్మ

వైఎస్సార్ ఆస్తులు పంచలేదు-విజయమ్మ
  • విజయసాయి రెడ్డి, వైవీ చెప్పేవన్నీ అబద్ధాలే: విజయమ్మ
  • జగన్, షర్మిలకు సమానంగా పంచాలి
  • అటాచ్ మెంట్​లో లేని ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరిగిందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ ఉన్నపుడే ఆస్తులు పంచారంటూ ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చెప్పింది పచ్చి అబద్ధమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి ఆడిటర్ గా ఉన్నారు. కాబట్టి ఆయనకు అన్ని తెలుసునని, వైవీ సుబ్బారెడ్డి మా ఇంటి బంధువుగా ఆస్తుల అగ్రిమెంట్ పై సాక్షి సంతకం చేశారని, అయినా మీడియాతో అవాస్తవాలు మాట్లాడటం తనకు బాధ కలిగించిందని విజయమ్మ అన్నారు.

వైఎస్ఆర్ ఉన్నపుడు కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేర్ల మీద రాశారని, ఇది ఆస్తుల పంపిణీ కాదన్నారు. మంగళవారం వైఎస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖలో పలు అంశాలు వెల్లడించారు. ‘తల్లిగా నాకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానంగా పంచాల్సిందే. తమ ఆస్తులను నలుగురు చిన్నబిడ్డలకు(మనుమలు, మనమరాళ్ల)కు సమానంగా పంచాలని వైఎస్ఆర్ అన్నది నిజం’ అని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాదేస్తోందన్నారు. అటాచ్​మెంట్​లో లేని ఆస్తుల విషయంలో షర్మిలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ఆస్తుల వివాదం కంటిన్యూ అవ్వకూడదని, అందుకే తాను బహిరంగ లేఖ ద్వారా నిజాలు బయటకు తెస్తున్నానని 
ఆమె స్పష్టంచేశారు.

జగనే స్వయంగా రాసి సంతకం పెట్టాడు

“2009 నుంచి 2019 వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, రూ.200 కోట్లు షర్మిల వాటాగా ఇచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం జగన్ కు 60 శాతం, షర్మిలకు  40 శాతం. అయితే, అగ్రిమెంట్ కు ముందు.. సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు. ఎందుకంటే షర్మిలకు  సమాన వాటా ఉంది కనుక. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని. 2019లో సీఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్ చేసిండు.

దీంతో ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. అటాచ్​మెంట్ లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, అటాచ్​మెంట్​లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, షర్మిలకు  వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే స్వయంగా రాసిచ్చి సంతకం పెట్టాడు.  అవి ఇవ్వకుండ.. అటాచ్ మెంట్​లో లేని ఆస్తుల విషయంలో కూడా షర్మిల కు అన్యాయం జరిగింది, ఆమె  భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది” అని విజయమ్మ పేర్కొన్నారు.