
- నేడు, రేపు చెల్లించేందుకూ అవకాశం
- ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు రేపు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఓపెన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు రూ.1000 కోట్ల మైలురాయిని దాటాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించేందుకు (వన్ టైమ్ సెటిల్మెంట్.. ఓటీఎస్) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటి వరకు రూ.1,010 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైనట్టు పురపాలక శాఖ వెల్లడించింది.
మార్చి 31 నాటికి ఆస్తి పన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే, ఈ నెల 30, 31 తేదీల్లో సెలవు దినాలు అయినప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది. అలాగే, సోమవారం (ఈ నెల 31) సెలవుగా ప్రకటించినప్పటికీ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేండ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.
కాగా, ఈ నెల 30, 31 సెలవు దినాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపునకు 31న కూడా అవకాశం కల్పించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. 31న బ్యాంకులు కూడా పనిచేయనున్న నేపథ్యంలో ఆ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.