వంద శాతం ఆస్తి పన్ను వసూలయ్యేనా?..మరో మూడు రోజులే గడువు

వంద శాతం ఆస్తి పన్ను వసూలయ్యేనా?..మరో మూడు రోజులే గడువు

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. 19 మున్సిపాలిటీల్లో ఏడింటిలో ఆస్తి పన్ను వసూళ్లు మెరుగ్గా ఉండగా, మిగిలిన 12 మున్సిపాలిటీల్లో వసూళ్లు తక్కువగా ఉంది. ఈ నెలాఖరులోగా వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని కలెక్టర్లు లక్ష్యాన్ని నిర్దేశించినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.

కేంద్రం నిధులు రావాలంటే..

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను ఆశించిన స్థాయిలో వసూలైతేనే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్​ అవుతాయి. వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను నిరుటి కంటే ఎక్కువగా వసూలైంది. పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం నుంచి ఈ నిధులు విడుదల అవుతాయి. వాటితో కాలనీల్లో పారిశుద్ధ్యం, డ్రింకింగ్  వాటర్, ఇతర సివిల్​ వర్క్స్​ చేపడతారు. గత ఆర్థిక సంవత్సరం వసూలు చేసిన ఆస్తి పన్ను కంటే 12.95 శాతం ఎక్కువగా ఉంటేనే 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్​ చేస్తారు.

నాగర్​కర్నూల్​లో నిరుడు రూ.3.98 కోట్లు వసూలవగా, ఈ ఏడాది రూ.4.03 కోట్లు, అచ్చంపేటలో గత ఏడాది రూ. 2.08 కోట్లు, ఈ ఏడాది రూ. 2.11 కోట్లు, అయిజలో గత ఏడాది రూ.1.44 కోట్లు, ఈ ఏడాది రూ.1.47 కోట్లు, మక్తల్​లో గత ఏడాది రూ.1.26 కోట్లు, ఈ ఏడాది రూ.1.28 కోట్లు, వనపర్తిలో గత ఏడాది రూ.4.52 కోట్లు, ఈ ఏడాది రూ. 4.92 కోట్లు, కొత్తకోటలో గత ఏడాది రూ. 84 లక్షలు, ఈ ఏడాది రూ. 99 లక్షలు, పెబ్బేరులో గత ఏడాది రూ.61 లక్షలు వసూలవగా, ఈ ఏడాది రూ.80 లక్షలు వసూలయ్యాయి.