
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రాపర్టీ ట్యాక్స్ ప్రభుత్వం ఆశించినంతగా వసూలు కావడం లేదు. రాష్ర్టంలో మొత్తం 153 మున్సిపాలిటీల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,680 కోట్లు వసూలు కావాల్సి ఉండగా గురువారం వరకు రూ.800 కోట్లు మాత్రమే వసూలు అయిందని అధికారులు తెలిపారు.
ట్యాక్స్ చెల్లించేందుకు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉండడంతో టార్గెట్ రీచ్ కావాల్సిందే అని మున్సిపల్ కమిషనర్లను కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ టీకే శ్రీదేవి ఇప్పటికే ఆదేశించారు. ఈ అంశంపై ఇటీవల కమిషనర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్యాక్స్ తక్కువ వసూలు చేసిన కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆ కమిషనర్లకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా.. వచ్చే నెల 31 వరకు సుమారు 90 శాతం ఆస్తిపన్ను వసూలు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.