ఆస్తి పన్ను కట్టేందుకు ఇయ్యాలే ఆఖరు

హైదరాబాద్​, వెలుగు: 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపు గడువు గురువారంతో ముగియనుంది. సిటీలోని అన్ని సిటిజన్ సర్వీస్ కేంద్రాలు అర్ధరాత్రి 12 గంటల వరకు పని చేస్తాయని అధికారులు తెలిపారు. బల్దియా టార్గెట్​ చేరుకోలేకపోయింది.   2020–21 సంవత్సరానికి కరోనా టైమ్​లోనే  రూ.1,663 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఏడాది కూడా ఇంత మొత్తం టార్గెట్​గా పెట్టుకుంది. రూ.250 కోట్లు తక్కువగానే వచ్చేలా ఉంది. బుధవారం నాటికి రూ.1,392 కోట్లు వచ్చింది. ఇక ఒక్క రోజే మిగిలింది. ఎంత వచ్చినా గతేడాది కలెక్షన్ మాత్రం మించే అవకాశంలేదు. ఆస్తిపన్ను చెల్లంచని వారికి 24 శాతం  పెనాల్టీ పడనుంది. వెయ్యి రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్​ పెండింగ్ లో ఉంటే   రూ.240 రూపాయల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆస్తిపన్ను  తప్పనిసరిగా చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. సిటిజన్ సర్వీస్ సెంటర్లతో పాటు మీ-సేవ కేంద్రాలు, ఆన్​లైన్​లోనూ ఆస్తిపన్నును చెల్లించవచ్చని చెబుతున్నారు.