- ఒక్కొక్కరికి 200 గజాల కేటాయింపులు
- ఇల్లు మాత్రం 58 లేదా 77 గజాల్లో కట్టేలా ప్లాన్
- ఇంటి స్థలం అప్పగించని గ్రామస్థులు
యాదాద్రి, వెలుగు:అంతని.. ఇంతని రెండేండ్లుగా ఆశల్లో ఉన్న వాసాలమర్రి ప్రజలకు చివరకు నిరాశ తప్పడం లేదు. కేసీఆర్చెప్పిన బంగారు వాసాలమర్రిలో డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించడానికి ప్రపోజల్స్ సిద్ధమయ్యాయి. అందరికీ ఒకే మాదిరిగా 200 గజాలు కేటాయించనున్నా.. ఇల్లు మాత్రం 58 లేదా 77 గజాల్లో మాత్రమే నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త ఇండ్ల కోసం తమ ఇంటి స్థలాలను డెవలప్మెంట్కమిటీకి అప్పగిస్తున్నట్టుగా గ్రామస్థులు అగ్రిమెంట్ఇవ్వలేదు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని 2020 నవంబర్లో సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న 10 నెలల తర్వాత 2021 ఆగస్టులో అందరికీ కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 17 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు కొత్తగా ఇంటి పర్మిషన్లను సర్కారు నిలిపివేసింది. దీనిపై మీడియాలో వరుస కథనాలు రావడంతో చివరకు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే.. కొత్తగా ఉన్న నిర్మాణాలను వదిలి మిగిలిన వారికి ఇండ్లను నిర్మించి ఇస్తామని వాసాలమర్రిలో గత నెల 24న జిల్లా ఆఫీసర్లు గ్రామసభ పెట్టి ప్రకటించారు. ఇందుకుగాను ఇంటి స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగించాలని షరతు పెట్టి, అగ్రిమెంట్ఎలా ఉండాలో కూడా ఓ ప్రింటవుట్ కాపి పంచాయతీలో ఇచ్చారు. గ్రామ సభ నిర్వహించి 20 రోజులు గడిచింది. ఆఫీసర్లు చెప్పిన ప్రకారం గ్రామంలో 303 ఇండ్లు తొలగించాల్సి ఉంది. ఈ ఇండ్లకు సంబంధించిన యజమానులు ఎవరూ ఇప్పటివరకూ తమ ఇంటి స్థలాలను గ్రామ అభివృద్ధి కమిటీకి అప్పగిస్తున్నట్టు అగ్రిమెంట్ఇవ్వలేదు.
303 ఇండ్ల నిర్మాణానికి నిర్ణయం
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నందున తమ దశ తిరుగుతుందని వాసాలమర్రి గ్రామస్థులు భావించారు. మొదట ఈ గ్రామంలోనే దళితబంధు అమలు చేయడంతో వారి నమ్మకం మరింత పెరిగింది. అయితే వారి ఆశలు తలకిందులయ్యే విధంగా నిర్ణయాలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రామానికి చెందిన 34.08 ఎకరాల్లో 4 ప్రధాన రోడ్లు, ఇండ్ల మధ్య చిన్నా.. పెద్ద కలిపి 30 లింక్ రోడ్లు నిర్మించడానికి ప్రపోజల్స్ సిద్ధం చేశారు. పార్కులు, ఫంక్షన్హాల్సహా ఇతర అవసరాల కోసం మరో 1.16 ఎకరాలు కేటాయించారు. కొత్తగా ఉన్న ఇండ్లు 103 పోనూ చెప్పినట్టుగా 303 ఇండ్లను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొన్ని జీ ప్లస్వన్ఇండ్లు కూడా ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి 200 గజాల స్థలం కేటాయించడానికి సిద్ధమయ్యారు. కొత్తగా వేస్తున్న రోడ్ల విస్తరణకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెట్బ్యాక్లో ఇండ్ల నిర్మాణం చేయాలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని ప్రపోజల్స్పెట్టారు. ఒక్కో ఇంటిని 58 గజాల్లో నిర్మించాలని, లేకుంటే 77 గజాలకు మించకుండా నిర్మించాలని ప్రపోజల్స్లో చేర్చారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆగిన పంచాయతీ బిల్డింగ్పనులు
రూ. 20 లక్షలతో కొత్తగా నిర్మించాలని భావించిన వాసాలమర్రి పంచాయతీ బిల్డింగ్కు ఆటంకం ఎదురైంది. కూల్చివేసిన హాస్టల్ బిల్డింగ్ స్థలంలో కాకుండా ప్రస్తుతం ఉన్న పంచాయతీ బిల్డింగ్ ప్లేస్లోనే నిర్మించాలని గ్రామస్థులు అంటున్నారు. కొత్తగా నిర్మించే ఇండ్ల కోసం తయారు చేసిన లే అవుట్ప్రకారం ప్రస్తుతం పంచాయతీ కట్టాలనుకుంటున్న ప్లేస్లో రోడ్డు రావాల్సి ఉంది. ఈ అభ్యంతరంతో పంచాయతీ బిల్డింగ్నిర్మాణం మొదలు పెట్టకముందే నిలిచిపోయింది.
ఖర్చు తగ్గించడానికేనా..
వాసాలమర్రిలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలన్న నిర్ణయం వెనుక ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశం ఉందని అంటున్నారు. వాసాలమర్రి డెవలప్మెంట్ కోసం గతేడాది జూలైలో రూ. 150 కోట్ల నుంచి రూ. 165 కోట్లతో డీపీఆర్ రూపొందించగా.. చివరకు అది రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు మార్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వాసాలమర్రిలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడానికి ప్రపోజల్స్ రెడీ చేశారని అంటున్నారు.