తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం బేగంపేట్ లో వింగ్స్ ఇండియా 2020 గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమాన సౌకర్యం కల్పించేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపామన్నారు. అందుకు అవసరమైన నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర సంస్థల సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు.
మంత్రి తెలిపిన ఆరు ప్రాంతాల్లో మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు కాగా.. మరో మూడు గ్రౌండ్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు. మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు.. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి, మహబూబ్ నగర్ లోని గుడివల్లి లను ప్రతిపాదించారు. అలాగే గ్రౌండ్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు వరంగల్ జిల్లాలోని మామూనూరు, పెద్దపల్లి లోని బసంత్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్లాన్ చేశామన్నారు.
ఈ నెల 27వ తేదీన వరంగల్ లో ఈ అంశం పైన సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు కేటీఆర్. ఆ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కూడా ఆహ్వానించాలని అధికారులకు తెలిపారు.