
- మొదటి దశలో 57 రైళ్లకు రూ.1,800 కోట్ల ఖర్చు
- ఇప్పుడు 10 రైళ్లకే రూ.500 కోట్లు
- దేశీయ కంపెనీల నుంచి తెచ్చే యోచన
- బీఈఎమ్ఎల్తో చర్చలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త మెట్రో రైళ్లు లేదా కొత్త మెట్రో కోచ్‌లు తీసుకువచ్చే ప్రతిపాదనలు ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం, ఉన్న రైళ్లు పీక్ అవర్స్ లో కిక్కిరిసిపోతుండడంతో అదనపు రైళ్లు, కోచ్ లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కొన్నేండ్లుగా వ్యక్తమవుతోంది. ఈ ఎండాకాలం ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు నడుపుతున్న 57 రైళ్లకు అదనంగా మరిన్ని తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే, మొదట తెచ్చినప్పటితో పోలిస్తే ఖర్చు ఎక్కువ కావడం, దేశీయ సంస్థలు తయారు చేసిన కోచ్‌లు, రైళ్లు కొనాలనే ప్రతిపాదనతో ఆలస్యమవుతున్నట్టు తెలుస్తున్నది. అలాగే నష్టాల భారం కూడా లేట్కావడానికి మరో కారణమని అంటున్నారు.
నాగపూర్ నుంచి కోచ్‌లు..
ఇప్పుడు నడుస్తున్న మెట్రో రైళ్లను దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ సంస్థ తయారు చేసింది. నాగ్‌పూర్ మెట్రో రైళ్లను కూడా అదే సంస్థ తయారు చేయడంతో సాంకేతికంగా అనుకూలంగా ఉంటాయని 2023లో నాగ్‌పూర్ మెట్రో నుంచి మూడు, నాలుగు కోచ్ లతో కూడిన రైళ్లను లీజ్ కు తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి నాగ్‌పూర్ మెట్రో సంస్థ ఒప్పుకుంది. అయితే, నాగ్‌పూర్‌లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగాపెరగడంతో ఒప్పందానికి బ్రేకులు పడ్డాయి. తర్వాత సింగపూర్ మెట్రోనుంచి రైళ్లను తీసుకురావడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు.
పది కొత్త రైళ్లకు రూ.500 కోట్లు...
హ్యూందాయ్ రోటేమ్ సంస్థ మొదటి దశలో 57 రైళ్లను హైదరాబాద్ మెట్రోకు అందించింది.171 కోచ్ లతో కూడిన 57 రైళ్లకు రూ.1800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. దక్షిణ కొరియా నుంచి దిగుమతి, రవాణ ఖర్చులు అదనం అయినట్లు సమాచారం. మొదటి దశ ఒప్పందం 2012 లో జరగ్గా, అప్పటి ధరలు, ఇప్పటి ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. దీంతో మళ్లీ హ్యూందాయ్ సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తే ఒక్కో మెట్రో కోచ్ కు 15 కోట్లు దాటే అవకాశం ఉంది.
దీంతో దేశీయ కంపెనీలకు మెట్రో రైళ్ల తయారీ బాధ్యతను అప్పగించాలని మెట్రో అధికారులు నిర్ణయించినట్లు తెలస్తున్నది. ఈ విషయమై భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్ఎల్) సంస్థతో పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.