- మొత్తంగా రూ. 86 వేల కోట్లు దాటిన ప్రాజెక్టు వ్యయం
- పూర్తయ్యే సరికి లక్షా 20 వేల కోట్లు దాటుతుందంటున్న ఇంజనీర్లు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇంకోసారి పెరుగుతోంది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు పనులకు సంబంధించి గతంలోనే రూ. 1,588 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచగా.. తాజాగా మరో రూ. 5,243.41 కోట్ల మేర పెంపుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, ప్యాకేజీ –7, ప్యాకేజీ–8 పనుల ఖర్చును రూ.3,461 కోట్ల మేర పెంచేలా 20 రోజుల కిందే అంచనాలు సిద్ధం చేయగా.. ఇప్పుడు ఆరో ప్యాకేజీలో మరో రూ.1,663.69 కోట్లు పెంచుతూ ప్రతిపాదనలు రెడీ చేశారు. ఈ పెంపు (కాస్ట్ ఎస్కలేషన్)కు సర్కారు అంగీకారం లాంఛనమేనని, దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ పనులు చేపట్టినప్పటి ప్రతిపాదనల (రూ. 15,048 కోట్ల)తో పోలిస్తే.. మొత్తంగా పెంపు రూ. 8,254 కోట్లకు చేరుతుండటం గమనార్హం. మొత్తంగా ప్రాజెక్టు వ్యయం కూడా రూ.86 వేల కోట్లకు పెరుగుతోంది. పనులన్నీ పూర్తయ్యే సరికి ఈ ఖర్చు లక్షా 20 వేల కోట్లకు చేరుతుందని.. మూడో టీఎంసీ తరలింపు పనులను కలిపితే లక్షన్నర కోట్లకూ పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు.
ఈ సారి ఆరో ప్యాకేజీలో..
ప్యాకేజీ–6 పనులు చేపట్టేందుకు తొలుత రూ.5,243.31 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. ఇప్పుడీ వ్యయాన్ని రూ.6,907కు పెంచేలా ప్రతిపాదనలు రెడీ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కెనాల్, ట్విన్ టన్నెళ్ల ద్వారా నంది మేడారం సర్జ్‌పూల్‌కు చేరే నీళ్లను అక్కడి పంపుహౌస్‌లోని మోటార్ల ద్వారా ఎత్తిపోసే మొత్తం వ్యవస్థను ప్యాకేజీ–6గా వ్యవహరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2లో ఇది మొదటి ప్యాకేజీ. 2011లో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా రూ.4,004 కోట్లతో ఈ పనులు చేసేందుకు నవయుగ– పటేల్– బీహెచ్‌ఈఎల్ కన్సార్షియం టెండర్ దక్కించుకుంది. తెలంగాణ ఏర్పాటై టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక దీని వ్యయాన్ని రూ.5,243.31 కోట్లకు పెంచింది.
గ్రావిటీ కెనాల్ నుంచే పెంపు షురూ..
ఎల్లంపల్లి నీటిని ట్విన్ టన్నెళ్లకు తరలించే గ్రావిటీ కెనాల్ నుంచే నిర్మాణ వ్యయాన్ని పెంచడం మొదలుపెట్టారు. గ్రావిటీ కెనాల్‌పై క్రాస్ బండ్, బండ్లవాగును మళ్లించేందుకు డైవర్షన్ కెనాల్, ఇతర నిర్మాణాల ఖర్చు, టన్నెళ్ల లైనింగ్ పనుల ఖర్చు పెరిగినట్టుగా తాజా పెంపు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈఎన్సీ క్యాంపు ఆఫీస్, స్టాఫ్ క్వార్టర్స్, హెలిప్యాడ్స్, కమ్యూనికేషన్ సిస్టం, పంపుహౌస్ కాంపౌండ్ వాల్, రూఫ్ ప్రొటెక్షన్, పంపుహౌస్‌లో నీటి తొలగింపు, ఎలక్ట్రో మెకానికల్ స్పేర్ పార్ట్స్, సిమెంట్–స్టీల్ ధరలు, ఫ్యూయల్ చార్జీల పెంపుతో నిర్మాణ వ్యయం పెరిగినట్టు తెలిపారు. రివైజ్డ్ ఎస్టిమేట్లకు అనుగుణంగా జీఎస్టీ పెరుగుతుందని, సీనరేజీ చార్జీలు పెరిగాయని పేర్కొన్నారు. ఇక గ్రావిటీ కెనాల్, పంపుహౌస్‌లు, ఇతర పనుల కోసం అదనంగా 488.11 ఎకరాల భూమిని సేకరించారు. దానికి పరిహారంగా రూ.23.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీకి పెంపు వివరాలను అందజేశారు. దీనికి త్వరలోనే సర్కారు ఆమోదం రానుందని అధికారులు చెప్తున్నారు.