వరంగల్ కేంద్రంగా వ్యభిచార దందా.. తరచూ పట్టుబడుతున్నా మారని వైనం

వరంగల్ కేంద్రంగా వ్యభిచార దందా.. తరచూ పట్టుబడుతున్నా మారని వైనం
  • ఆర్థిక ఇబ్బందులున్న యువతులు, మహిళలను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్న దుండగులు
  • వరంగల్ నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న బాగోతం
  • నామమాత్రపు కేసులతో సరిపెడుతున్న పోలీసులు

హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెళ్లకు చెందిన ముస్కు లత వరంగల్ లో తల్లిదండ్రులు లేని ఓ మైనర్​ బాలికను ట్రాప్​ చేసింది. ఆమెకు గంజాయి మత్తు అలవాటు చేసి వ్యభిచారంలోకి దింపింది. ఆమె ద్వారా మరో బాలికను కూడా చీకటి దందాలోకి లాగే ప్రయత్నం చేయగా, చివరకు ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వ్యభిచార ముఠా దందా బయటపడింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి పెద్ద మొత్తంలో కండోమ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గద్వాల జిల్లా మల్దకల్​ మండలానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటూ చదువుకుంది. గతేడాది మార్చి 10న ఉద్యోగం కోసం హైదరాబాద్​ వెళ్లగా, ఓ వ్యభిచార ముఠా ఆమెను ట్రాప్​ చేసింది. అక్కడి నుంచి వరంగల్ శివారులోని వంగపహడ్​ తీసుకువచ్చి వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం చేయగా, ఆ గ్యాంగ్​నుంచి తప్పించుకున్న యువతి హసన్​పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను దోషులుగా తేలుస్తూ కోర్టు వారికి తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది.

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో వ్యభిచార దందా విచ్చలవిడిగా సాగుతోంది. నిరుపేద కుటుంబాలు, ఆర్థిక ఇబ్బందులున్న యువతులు, మహిళలకు డబ్బు ఆశచూపుతున్న కొన్ని ముఠాలు వారిని ట్రాప్ చేస్తున్నాయి. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యభిచార రొంపిలోకి దింపి, సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నాయి. ఎంతోమంది అమాయక యువతులు, మహిళలు వీరి చేతిల్లో చిక్కి జీవితాలను నాశనం చేసుకుంటుండగా, కొన్నిచోట్ల విషయం తెలిసి ఆఫీసర్లు కూడా లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపాదడపా వ్యభిచార ముఠాలను పోలీసులు పట్టుకున్నా, నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వల్ల వాళ్లు మళ్లీ అదే దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిరుపేదలే టార్గెట్.. 

వరంగల్ ట్రై సిటీతోపాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు వ్యభిచారానికి అడ్డాగా మారాయి. ఇప్పటికే సిటీ శివారులోని కొన్ని గ్రామాలు ఈ దందాకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుండగా, యువతులతో వ్యభిచార దందా సాగిస్తున్న దుండగులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో నెట్వర్క్​ ఏర్పాటు చేసుకుని ఈ బాగోతం నడిపిస్తున్నారు. ముఖ్యంగా యువతులతోపాటు ఆర్థిక పరిస్థితులు బాగోలేని కుటుంబాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసి ఈ బిజినెస్ సాగిస్తున్నారు. 

కొంతమంది నిర్వాహకులు భువనగిరి, కరీంనగర్, వేములవాడ, హుస్నాబాద్, విజయవాడ, ఒంగోలు, తిరుపతి తదితర ప్రాంతాలతోపాటు వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇతర  రాష్ట్రాల నుంచి కూడా యువతులు, మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. అందులో కొంతమందికి నెలల చొప్పున కాంట్రాక్ట్ మాట్లాడుకుని వ్యాపారం చేస్తుండటం గమనార్హం.

పట్టుబడినా మళ్లీ అదే దందా..

టాస్క్ ఫోర్స్ దాడుల్లో వ్యభిచార ముఠాలు పట్టుబడిన ఘటనలు చోటుచేసుకుంటుండగా, అంతా తెలిసి కొన్నిచోట్లా స్థానిక పోలీసులు లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోనే టాస్క్​ఫోర్స్​ పోలీసులు అడపాదడపా వ్యభిచార ముఠాలను పట్టుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నా వారిపై నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటంతో వాళ్లు మళ్లీ అదే బాగోతం నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. గతేడాది సెప్టెంబర్ 10న గోపాలపూర్ శివసాయి కాలనీలో సోడాశపల్లికి చెందిన ఓ మహిళ వ్యభిచార గృహం నడుపుతూ పట్టుబడగా, అదే మహిళ ఈ నెల ఒకటో తేదీన కూడా పట్టుబడడం గమనార్హం. 

వరంగల్ దేశాయిపేటకు చెందిన ఓ వ్యభిచార గృహ నిర్వాహకురాలు నిరుడు అక్టోబర్​ 17న పోలీసులకు పట్టుబడింది. ఆమె అంతకుముందు కాకినాడకు చెందిన ఓ యువతిని కూడా తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దించగా, 2022 ఫిబ్రవరి 7న పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో పోలీసులు పట్టుకున్న వ్యభిచార ముఠాలు మళ్లీ అదే దందా సాగిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠాలపై పీడీ యాక్టులు నమోదు చేయాలని, అమాయకుల జీవితాలు గలీజ్​దందాకు బలి కాకుండా చూడాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.