బంటి కుటుంబానికి రక్షణ కల్పించండి .. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం

బంటి కుటుంబానికి రక్షణ కల్పించండి .. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశం

సూర్యాపేట, వెలుగు : పరువు హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. గురువారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల హత్యకు గురైన కృష్ణ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనంతరం కలెక్టరేట్ లో కేసు పురోగతిపై అధికారులతో చైర్మన్ చర్చించారు. కేసు వెనక్కి తీసుకుంటే రూ. రెండు కోట్లు ఇస్తామని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా..  నిందితులను, బెదిరింపులకు పాల్పడేవారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆయన ఆదేశించారు.  బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, త్వరగా న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు.  

ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు.. త్వరలోనే మిగతావారిని పట్టుకుంటామని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా మృతుడి భార్యకు పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు, 5 ఎకరాల భూమి, జాబ్ ఇవ్వాలని చైర్మన్ ఆదేశించారు. కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు, ఆర్డీఓ వేణు మాధవ్ , ఎస్సీ సంక్షేమాధికారి లత, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.