కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వుల ప్రత్యేకతను కాపాడాలి: అటవీ ఆఫీసర్లకు మంత్రి కొండా సురేఖ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వులు రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్నాయని, వాటి ప్రత్యేకతను కాపాడేలా చర్యలు చేపట్టాలని అటవీ అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్ లో కొండా సురేఖ ఆధ్వర్యంలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల గవర్నింగ్ బాడీస్ సమావేశం జరిగింది. టైగర్ రిజర్వుల గవర్నింగ్ బాడీ, టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, గవర్నింగ్ బోర్డుల ఏర్పాటు, విధివిధానాలను మంత్రికి అటవీ ఉన్నతాధికారులు  వివరించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని  గ్రామాల తరలింపు ప్రక్రియపైనా మంత్రి ఆరా తీశారు. 

ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ..టైగర్ రిజర్వ్​ల పరిధిలోని గ్రామాల తరలింపుతోపాటు గ్రామ ప్రజలకు పునరావాస ప్రక్రియను పకడ్బందీగా చేట్టాలని అధికారులను ఆదేశించారు. జింకల సంఖ్యను పెంచడం హర్షణీయమన్నారు. పట్టుపురుగుల పెంపకంపై స్థానికులకు శిక్షణను కల్పించి, ఉపాధి కల్పించాలని సూచించారు. సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట, -శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.  దోమలపెంట, శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లో భాగంగా అక్కమహాదేవి గుహాలకు భక్తులు చేరుకునేలా  అవకాశాలను పరిశీలించాలన్నారు.

సలేశ్వరం జాతరను భవిష్యత్ లో చేపట్టనున్న సర్క్యూట్ లలో  చేర్చాలని,  సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. వన్యప్రాణుల దాడుల్లో మృతిచెందినవారి కుటుంబాలకు ఇచ్చే  నష్టపరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెడ్మా బొజ్జు, రేకుపల్లి భూపతి రెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ రాంబాబు (అమ్రాబాద్ టైగర్  రిజర్వ్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ  శాంతారాం (కవ్వాల్ టైగర్ రిజర్వ్) తదితరులు పాల్గొన్నారు.