ఇల్లెందు (టేకులపల్లి), వెలుగు : వార్షిక లక్ష్యాల్లో భాగంగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ అధికారులకు సూచించారు. ఆదివారం ఏరియాలోని టేకులపల్లి మండలం కోయగూడెం ఓసీలో ఆయన పర్యటించారు. ఓసీ సందర్శనకు వచ్చిన సీఎండీకి ఇల్లెందు ఏరియా జీఎం జాన్ ఆనంద్, ఓసీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఓసీ వ్యూ పాయింట్ నుంచి క్వారీలో జరుగుతున్న ఓబీ, బొగ్గు వెలికితీత పనులను సీఎండీ పరిశీలించారు.
రోజువారీఈ ఉత్పత్తి, రవాణా, సర్ఫేస్ మైనర్ పనితీరు గురించి ఏరియా జీఎం జాన్ ఆనంద్, అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందు ఏరియా మనుగడకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. ఇల్లెందు జేకే 5 ఓసీ పొడిగింపు ప్రాజెక్టుతో పాటు కేఓసీ పిట్-3 పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ (పిపి) జి.వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ (ఆపరేషన్) ఎన్ వీకే శ్రీనివాస్, సేఫ్టీ జీఎం గురవయ్య తదితరులు ఉన్నారు.