మూసీ ప్రాంత ప్రజల జీవితాలు బాగుచేస్తం : భట్టి విక్రమార్క

మూసీ ప్రాంత ప్రజల జీవితాలు బాగుచేస్తం : భట్టి విక్రమార్క
  •     వారికి ఏ సాయం చేయడానికైనా సర్కారు సిద్ధం: డిప్యూటీ సీఎం భట్టి
  •     గత ప్రభుత్వం మాదిరిగా గాలికి వదిలేయం 
  •     ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్య 
  •     సీఎం విజన్​ను ప్రజలకు వివరించాలని అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : మురికితో నిండిపోయి ఉన్న మూసీని బాగు చేసినట్టే.. మూసీ పరీవాహక  ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను కూడా బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, అభివృద్ధికి సంబంధించిన విజన్ ను మూసీ పరీవాహక ప్రాంతాల వాసులకు వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. బుధవారం సెక్రటేరియెట్​లో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్ పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. 

మూసీ ప్రజలను గత ప్రభుత్వం మాదిరిగా గాలికి వదిలేయకుండా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వారికి ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్నాళ్లు మూసీని ఒక ఆస్తిగా వాడుకోవాల్సి ఉండగా.. డ్రైనేజీ కాలువ లాగా వదిలేశారన్నారు.‌‌‌‌‌‌‌‌ లండన్ లో ఉన్న థేమ్స్ నది మాదిరిగా మూసీని ప్రక్షాళన చేసుకుని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టాలు ఉండి ఇండ్లు నిర్మించుకున్న వారిని

పట్టాలు లేకుండా గుడిసెలు వేసుకుని ఉన్న మూసీ ప్రాంత ప్రజలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇండ్లు కోల్పోతున్న వారి పిల్లలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు వారు వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తామని తెలిపారు. 

అందరి సలహాలు తీసుకుంటం..

మూసీ ప్రక్షాళన విషయంలో బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, సామాజికవేత్తల సలహాలు, సూచనలు కూడా తాము వింటామని భట్టి అన్నారు.  ప్రజలకు మేలు జరిగే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.  ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. 

అపోహలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే హైదరాబాద్​ నగరానికి నష్టం చేసిన వారు అవుతారని అన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తాము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు ఉన్నారు.