అడవి బిడ్డల హక్కులకు రక్షణేది?

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 9న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా, సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు దేశంలోని ఏకలవ్య మోడల్ స్కూళ్ల విద్యార్థులతో ‘సంవాద్’ అనే వర్చువల్​కార్యక్రమం నిర్వహించారు. గిరిజన విద్యలో కేంద్రం కృషిపై చర్చించారు. తమిళనాడులో వివిధ సమస్యలపై ఆదివాసీల నుంచి ప్రభుత్వం వినతులు స్వీకరించింది. జార్ఖండ్ ప్రభుత్వం మంగళవారం నుంచి 2 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్​లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్..ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్​సౌలత్​లు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇలా పాలకులు ఏటా ఆదివాసీ దినోత్సవం పేరుతో ఒకరోజు సమావేశాలు నిర్వహించి ప్రసంగాలు చేస్తున్నారు తప్ప, ఆదివాసీల హక్కులను గుర్తించడం లేదు. వారి కోసం చేసిన చట్టాలను గౌరవించడం లేదు. 

అభివృద్ధి పేరుతో..

అపారమైన అటవీ వనరులు, ఖనిజాలు, ఔషధాలు, జంతుజాలం, జీవ వైవిధ్యాలకు ఆలవాలమైన ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో సాగిస్తున్న పారిశ్రామీకరణ వల్ల అడవి బిడ్డల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో 70 దేశాల్లో ఐదు వేల తెగలకు చెందిన 37 కోట్ల వరకు ఆదివాసీ జనాభా ఉంది. ఆదివాసీలు మన దేశ జనాభాలో 8.5 శాతం(సుమారు12 కోట్లు) మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం వ్యవసాయం (పోడు), అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 తెగల ఆదివాసీలు, మరో 5 తెగల మైదానులు కలిపి జనాభాలో 7.9 శాతం(సుమారు 62 లక్షలు) మంది భిన్నమైన సంస్కృతులు, జీవన శైలిని కలిగి ఉన్నారు. ఆదివాసీల హక్కులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి1994లో ఓ ముసాయిదా ప్రకటన వెలువరిస్తూ ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీల హక్కుల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. కానీ ఏ రాష్ట్రంలోనూ అధికారికంగా నిర్వహించడం లేదు. ఈయేడు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన వాటి రక్షణ కోసం ఆదివాసీ మహిళల పాత్ర అనే థీమ్ తో వేడుకలు నిర్వహించాలని యూఎన్​వో నిర్దేశించింది.

పీసా చట్టాన్ని అమలు చేయాలె..

ఆదివాసీ ప్రాంతాల్లో  గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెడుతూ రూపొందించిన పీసా చట్టానికి 2021 డిసెంబర్ 24 నాటికే 25 ఏళ్లు నిండాయి. కానీ దాని లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్​గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, బిహార్ లోని షెడ్యూలు ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంత సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి. జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసుకోవాలి. ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు కోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టు వల్ల భూమి నష్టపోయేవారికి  పరిహారం, పునరావాసం కల్పించాలని చట్టం చెబుతోంది. ఈ నిబంధనలను అనేక రాష్ట్రాలు ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామసభల తీర్మానాలను లెక్క చేయడం లేదు. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం.. ఇలా అనేక అంశాల్లో  పీసా స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలు కూడా పీసా స్ఫూర్తిని, ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలి. స్థానిక వనరులపై ఆదివాసీలకు హక్కులు కల్పించి, గ్రామసభల తీర్మానాలతో పరిపాలన సామర్థ్యం పెంచి, సంక్షేమ ఫలాల పంపిణీ సరిగా జరిగినప్పుడే గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి. 

- గుమ్మడి లక్ష్మీనారాయణ,

 ఆదివాసీ రచయితల వేదిక