మహిళా ఖైదీల హక్కులకు రక్షణేది?

రాష్ట్రంలో జైళ్ల శాఖ అధ్వాన స్థితిలో ఉన్నది. చాలా జైళ్లలో సౌలత్​లు సరిగా లేవు. ఖైదీలు వారి కనీస హక్కులు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా మహిళా ఖైదీలకు అన్యాయం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మహిళలకు స్పెషల్ జైలు ఒకటి మాత్రమే ఉన్నది. అన్ని జిల్లా జైళ్లలో పురుషులతో పాటే మహిళలకు జైళ్లు ఉన్నాయి. వాటికి పురుషులే అధికారులుగా ఉండటం వల్ల వారి కింద పనిచేసే మహిళా సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తమకు ఉన్న సమస్యలను మహిళా ఖైదీలు పురుష అధికారులకు చెప్పలేరు. వారు పొందాల్సిన హక్కులు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. అలాకాకుండా మహిళా జైలుకు మహిళలే అధికారులుగా ఉంటే మహిళల సమస్యలను అర్థం చేసుకొని, వారికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మహిళా జైలుకు మహిళా అధికారిని, మహిళా డాక్టర్, ఓ సైకాలజిస్ట్ ను నియమించాలి. 

వసతులు లేక ఇబ్బందులు

హైదరాబాదులో తప్ప మిగతా అన్నిచోట్ల పురుషులతో పాటే వాటి పక్కనే ప్రత్యేక బ్యారక్ లు పెట్టి మహిళా ఖైదీలను ఉంచుతున్నారు. వాటికి పురుషులే అధికారులుగా ఉంటున్నారు. మహిళా సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల మహిళా ఖైదీలకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. మహిళా హోంగార్డులతో డ్యూటీ చేయిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో జైళ్ల శాఖ తరఫున మహిళా సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అక్కడా మహిళా హోంగార్డులే దిక్కు. మహిళా ఖైదీలు ఉండే జైలుకు కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిని పర్యవేక్షించే అధికారులు పురుషులే కాబట్టి కొన్ని చోట్ల మహిళా ఖైదీలకు అన్యాయం జరుగుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. ములాకత్ రూమ్స్, ఆఫీసులు అన్ని కలిసి ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రతి ఖైదీకి నిర్ణీత స్థలం, ఆహారం లాంటి వసతులు అన్ని కొలతల ప్రకారం అందాల్సి ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వరంగల్ జైలు కూల్చకముందు మహిళా ఖైదీలు కరోనా సమయం లో వారి నైపుణ్యంతో మాస్క్ లు కుట్టి సంస్థకు, ప్రభుత్వానికి ఎంతో ఆదాయం సమకూర్చారు. అలాంటి మహిళా ఖైదీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదు. మహిళా ఖైదీలకు వృత్తి విద్యా కోర్సులు, నైపుణ్య శిక్షణ ఇస్తే జైళ్ల శాఖకు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. వాళ్లు బయటకు వచ్చిన తర్వాత కూడా స్వయం ఉపాధి పొందగలుగుతారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

ప్రత్యేక జైళ్ల ఏర్పాటు ఏది?

పురుష అధికారులు, సిబ్బంది మహిళల బ్యారక్​ల లోపలకి వస్తున్నారని, తమకు రక్షణ లేదని మహిళా ఖైదీలు ఎన్నోసార్లు పత్రికలు, మీడియా ముందు చెప్పినా పరిస్థితిలో మార్పు ఉండటం లేదు. వరంగల్ సెంట్రల్ జైలులో మహిళా స్పెషల్ జైలు ప్రతిపాదన వచ్చినా,  దాన్ని కూల్చి వేసి కొత్త జైలు కోసం ఇంత వరకు ముగ్గు కూడా పోయలేదు. అక్కడి మహిళా ఖైదీలను, సిబ్బందిని హైదరాబాద్, దూర ప్రాంతాలకు తరలించారు. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సెంట్రల్ జైళ్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా ఖైదీల కోసం ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేసి మహిళా ఆఫీసర్లు, సిబ్బందిని నియమించాలి. 

- ముచ్కుర్ సుమన్ గౌడ్
సామాజిక కార్యకర్త