తెలంగాణ రాజకీయ శిబిరాల్లో ఇపుడు సమీక్షల సీజన్ నడుస్తోంది. రాజకీయ పార్టీలకు ఎన్నికలు పరీక్ష అయితే, సదరు ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడమే ప్రగతికి మార్గం. అవి మొక్కుబడిగా కాక, కాస్త నిజాయితీగా జరగాలి. అదేదైనా తమను తాము అద్దంలో చూసుకున్నట్టుండాలి. ఎందుకంటే, అద్దం అబద్ధం చెప్పదు. అంతేతప్ప, అప్పటికప్పుడు పబ్బం గడుపుకునే కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్ వాడినట్టుండొద్దు.
అది ప్రమాదకరం! వైద్యుడి దగ్గరికి, లాయర్‌వద్దకు వెళ్లినపుడు అబద్ధాలు కాకుండా నిజాలే చెప్పాలి. పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఎన్ని నిజాలు దాచి, మరెన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. ఫలితాలను సమీక్షించుకునేటప్పుడైనా కాస్త నిజాయితీగా ఉండాలి. అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, ఒప్పుల్ని పెంచుకోవడానికి, తద్వారా పార్టీని బలోపేతం చేసుకునేందుకూ వీలవుతుంది. పార్టీల భవిష్యత్తుకు అవే మార్గనిర్దేశం చేస్తాయి.
ఢిల్లీ నుంచి కురియన్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ వచ్చి, ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై గాంధీభవన్‌లో సమీక్షలు జరుపుతోంది. ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయి ఎన్నికల ఫలితాలతో పాటు పలు సమకాలీన అంశాల్ని సమీక్షించి, తీర్మానాలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్యులతో భేటీలు నిర్వహిస్తున్నా.. వాటికి సమీక్షల స్వరూపం, లక్షణం కనిపించడం లేదు.
రాష్ట్రానికి చెందిన జాతీయ పార్టీ ముఖ్యుల్లో వ్యక్తిగత ఎజెండాలు, సొంత ఎదుగుదల లక్ష్యాలు పొడసూపుతున్నాయి తప్ప పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై శ్రద్ధాసక్తులు కనబడటం లేదు. ఇక ప్రాంతీయ పార్టీలో.. ఊహాజనిత అంశాలు, లేనివి ఉన్నట్టు చెప్పుకునే భ్రమలు తప్ప నిజాల ఆధారంగా చర్చించే సాహసం జరగటం లేదు.
జాప్యంతో నికర నష్టం
మొన్నటి అసెంబ్లీ, నిన్నటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలని లోతుగా సమీక్షించుకొని, భవిష్యత్ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించి ఉంటే రాష్ట్రంలో బీజేపీ మెరుగైన స్థితిలో ఉండేదని ఒక భావన! వలసలు బీజేపీ వైపు సాగేవని పార్టీ ముఖ్యులు కొందరి అభిప్రాయం. లోక్‌సభ ఎన్నికల్లో 8 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలుపొంది, 46 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి ఆధిక్యత లభించింది. ఇంతటి ఘనవిజయం అందించిన తెలంగాణ ప్రజానీకానికి ‘సెల్యూట్’ అంటూ రాష్ట్ర కార్యవర్గం తాజాగా ఓ తీర్మానం చేసింది.
తెలంగాణలో సంస్థాగత నిర్మాణం, ప్రజా ఉద్యమాల నిర్వహణపై బీజేపీ వెంటనే దృష్టి పెట్టాలి. లేకుంటే ఫలితాలు గాలివాటుగానే ఉంటాయని, పాల నురగలా వచ్చే సానుకూలత చప్పుమని పడిపోతుందని విశ్లేషకులంటున్నారు. అప్పుడు, రాష్ట్ర ప్రజలు ‘సెల్యూట్ బీజేపీ’ అనకుండా చూసుకోవాలని పార్టీ సగటు కార్యకర్త కోరుకుంటున్నాడు. ‘స్పష్టత లేని ఎజెండాతో ఎన్నికలకు వెళితే.. గెలుపోటములు భరోసా లేని గాల్లో దీపం’ అని కొందరు పార్టీ నాయకులే ప్రయివేటు సంభాషణల్లో అంగీకరిస్తారు. దీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకున్న పాతతరం, వలసవచ్చిన కొత్త నాయకుల మధ్య స్పర్ధ కొనసాగుతోంది. కొత్త అధ్యక్ష నియామకం అసాధారణంగా జాప్యమవుతోంది.
నీడ వదిలి నిజం బాటపట్టాలి
ఢిల్లీ నుంచి వచ్చిన కురియన్ గుచ్చిగుచ్చి అడక్కపోతే, అవే అబద్ధాల ‘క్యాసెట్ పలుకులు’ తిరిగి తిరిగి వినబడేవేమో! ‘బీఆర్‌ఎస్‌చివరి దశలో బీజేపీతో కుమ్మక్కైంది, అందుకే మనం 15కి బదులు 8 కి పరిమితమయ్యాం’ అని చెప్పే ప్రయత్నమొకటి బలంగా జరిగింది. బీజేపీ మీద అంత కోపంగా ఉన్న బీఆర్
ఎస్ వారికెలా మద్దతిస్తుంది? అని అడిగారాయన.
‘ఆడమంటే... గజ్జెలు పాత’ అన్న చందంగా ఉంది మన వారి సంజాయిషీ! ‘పోనీ, ఎమ్మెల్యేగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు తగ్గాయి?’ అంటే రాజధానిలో లోక్‌సభకు ఓడిన అభ్యర్థి గతుక్కుమనాల్సి వచ్చింది. ఏ ఆధారం లేకుండానే బీఆర్‌ఎస్ తమ ఓట్లను బీజేపీకి వేయించిందనే వాదనను ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. మిన్నకుంటే, 1956 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ని సీట్లు ఎప్పుడూ గెలవలేదనే పచ్చి అబద్ధాన్ని కూడా నిస్సిగ్గుగా ప్రచారంలోకి తేగల సమర్థులు కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారు.
పెద్ద మార్జిన్లు లభించిన ఖమ్మం వంటి స్థానాలతో కలిపి లెక్కించడం వల్ల, కాంగ్రెస్‌కు వచ్చిన సగటు ఓటు వాటా శాతం గౌరవప్రదం (40 శాతానికి కొంచెం అటిటు)గా కనిపిస్తుందే తప్ప చాలా చోట్ల కాంగ్రెస్‌కు రావాల్సిన ఓటు రాకుండా పోయింది. పార్టీ స్వీయ కారణాలతోనే ఆయా స్థానాల్లో ఓటమి పాలయింది. పార్టీ ఏదైనా సమీక్ష సవ్యంగా, నిజాయితీగా ఉంటేనే ఆత్మపరిశీలనకు అర్థం, పార్టీ భవితకు ఓ పరమార్థం!
తెలుగు రాష్ట్రాల్లో గెలుపు కష్టమే..
కేంద్ర మంత్రిగా మరిన్ని బాధ్యతలు పెరిగిన బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ పనులకు పూర్తి సమయం వెచ్చించలేకపోతు న్నారు. బయటినుంచి వచ్చిన వ్యక్తిగా ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి ఇవ్వొద్దని సంఘ్ పరమైన ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం! లోగడ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నల్ల జెండాలను ప్రదర్శించిన వ్యక్తికి అధ్యక్ష పీఠం ఇవ్వడమేంటనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు.
పార్టీలోకి ఈటల వచ్చినపుడు, ఎమ్మెల్యే అయినపుడు ఈ జ్ఞానం ఏమైంది? అని, ఎదురు ప్రశ్నించేవారూ ఉన్నారు. తరుణ్‌చుగ్ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేరెవరూ రాలేదు. పార్టీని బలోపేతం చేసే నిర్దిష్ట కార్యక్రమమేదీ ఇప్పటిదాకా రాలేదు. అస్సాం, త్రిపుర, ఒడిశాలోనూ గెలిచి సర్కార్లు ఏర్పాటు చేసిన బీజేపీ, రేపు పశ్చిమబెంగాల్‌లోనైనా గెలుస్తుందేమో కానీ, ఇలాగే ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో గెలుపు ఎప్పటికీ కష్టమేనని పరిశీలకులంటున్నారు.
‘పొరుగింటి పుల్లకూర’ వాసనలేంటో..
విమర్శలు ఎదుర్కొన్న పంజాబ్ కాంగ్రెస్‌నేత కెప్టెన్ అమరేందర్ సింగ్‌ను ప్రజల మధ్యకు తెచ్చేందుకు ‘కాఫీ విత్ కెప్టెన్’ రచించారు. ఎన్నో ‘బ్రాండ్‌మేకింగ్’ ఎక్సర్‌సైజ్‌ల తర్వాత 2017లో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ‘కుక్క తోక వంకర’ సామెత చందంగా మళ్లీ మునుపటి లక్షణమే చూపేసరికి, అయిదేళ్ల పాలన తర్వాత జనం ఆయన్ని ఓడించి ‘ఫామ్‌హౌస్’కే పరిమితం చేశారు.
‘విలీనం ద్వారా మేం డజను మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే, అందులో ఇద్దరే గెలిచారు. ప్రజలు తిరస్కరిస్తున్నారు, వారితో ఏ ఉపయోగమూ ఉండదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావు స్వీయ అనుభవం చెబుతున్నారు. ‘తోటకూర నాడే ఈ బుద్ధి ఉంటే..’ అని, తోచినవాళ్లు పాత కథ గుర్తుచేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ‘జగనే గెలుస్తున్నాడు’ అని ఎన్నికల ముందు అధినేత కేసీఆర్ చెబితే, ‘ఔను, ఆయనే గెలుస్తాడని భావించాం, కానీ ఓడారు, అయినా 40 శాతంపైగా ఓట్లు వచ్చాయి’ అని ఇప్పుడు తనయుడు కేటీఆర్ అంటున్నారు. సొంత వ్యవహారాలను గాలికొదిలి, ఈ ‘పొరుగింటి పుల్లకూర’ వాసనలేంటో జనాలకు అర్థం కావటంలేదు.
తీరు మారని బీఆర్ఎస్
‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మాటలు నమ్మి జనం మోసపోయారని, ఇప్పుడు నిజం తెలుసుకొని ‘దేశప్రజలే బాధపడుతున్నారు’ అని బీఆర్‌ఎస్ ఏకవాక్య తీర్మానానికి సిద్ధమైనట్టుంది. లోతైన సమీక్ష జరుపకపోవడంతో ఓటమికి నిజమైన కారణాలు ఆ పార్టీ తెలుసుకోలేకపోతోంది. గౌరవప్రదంగా 39 సీట్లు దక్కినా అసెంబ్లీ ఫలితాలను వాస్తవికంగా సమీక్షించుకొని, ప్రతిపక్షంగా గట్టిగా నిలబడతామని ముందుకు రాకపోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. మొత్తం ఏడేసి అసెంబ్లీ స్థానాలు గెలిచిన మెదక్, మల్కాజిగిరిలో కూడా పరాభవమే ఎదురైంది.
సరైన సమీక్ష బీఆర్‌ఎస్ నిర్వహించలేదు. అంతా మొక్కుబడి వ్యవహారమే! పాలనా కాలంలోనే కాదు, ఇప్పుడూ ‘ఫామ్‌హౌస్’ నుంచే వ్యవహారాలు! సమీక్షల కన్నా ఫొటో సెషన్లు ఎక్కువ సాగుతున్నాయి. అక్కడ కూడా..ఎవరో కొందరు ముఖ్యులకే అంతరాలయ దర్శనం. మిగతావారికి గర్భగుడి బయటి సర్వదర్శనాలే!
దిలీప్‌రెడ్డి, పొలిటికల్‌ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్‌సర్వే సంస్థ