జంతువులలో రాచఠీవికి, గాంభీర్యానికి ప్రతీక పులి. భీతిగొలిపే తిరుగులేని శక్తికి, లక్ష్యంపైకి విజృంభించి వేటాడే పట్టుదలకు ప్రతిరూపం.. మన దేశ జాతీయ జంతువు పులి. జానపద కథల్లోనే కాదు మన పురాణాల్లోనూ పులుల ప్రస్తావన ఉంది. దుర్గాదేవి వాహనం పులి, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వాహనం పులి. ఇలా పురాణగాథల్లోనూ పులికి విశిష్టస్థానం దక్కింది. ఎంతో గాంభీర్యత, విశిష్టత కలిగిన పులుల జీవనశైలి గురించి, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించే సంకల్పంతో 2010 నవంబర్ 24న సెయింట్
పీటర్స్‌బర్గ్‌లో తొలిసారి పులుల సదస్సును నిర్వహించారు. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పులులు ఎక్కువగా గల దేశాలు జులై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పాటిస్తున్నాయి.
జంతు ప్రపంచంలో పులులదీ, పిల్లులదీ ఒకటే జాతి. అందుకే పులికి ‘బిగ్ క్యాట్’ అని పేరు. ఇవి ముఖ్యంగా ‘ఫెలైన్’ జాతికి చెందినవి. ఇవన్నీ మాంసాహార జంతువులు, వాటి మనుగడ కోసం ఇతర జంతువులను వేటాడి తింటాయి. ఈ ‘ఫెలైన్’ జాతిలోని జంతువుల్లో పులులే పెద్దగా ఉంటాయి. ఎదిగిన మగపులి దాదాపు 250 కిలోల బరువు ఉంటుంది. ముక్కు నుంచి తోక వరకు సుమారు 10 అడుగుల పొడవు వుంటుంది.
ఆడపులి సుమారు 160 కిలోల బరువు ఉంటుంది. ఇవి దాదాపు ఎనిమిదిన్నర అడుగుల పొడవు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు మొత్తం తొమ్మిది జాతుల పులులు ఉండేవి. వాటిలో మూడు జాతుల పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి.
పులి ఆయుర్దాయం 26 ఏండ్లు
పులుల జీవన విధానానికొస్తే ఆడపులి ఒక ఈతలో రెండు నుంచి అరు వరకు పిల్లలను పెడుతుంది. వీటిలో కొన్ని పూర్తిగా ఎదగక ముందే కన్నుమూస్తాయి. పుట్టినప్పుడు పులి పిల్ల బరువు ముప్పావు కిలో నుంచి ఒకటిన్నర కిలో వరకు ఉంటుంది. వాటికి మూడున్నర నెలల వయసు వచ్చేంత వరకు తల్లిపులి వాటిని తన స్థావరంలో ఉంచి, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
ఆ తర్వాత తల్లి వద్ద వేట మెలకువలు నేర్చుకుంటాయి. ఏడాదిన్నర వయస్సు వచ్చేసరికి సొంతంగా వేటాడే స్థితికి చేరుకుంటాయి. అయితే, రెండున్నరేండ్లు వచ్చేంతవరకు తల్లి వద్దే పెరుగుతాయి. తర్వాత తల్లిని విడిచిపెట్టి తమ దారి అవి చూసుకుంటాయి. గరిష్టంగా ఒక పులి ఆయుర్దాయం 26 సంవత్సరాలు. ప్రపంచంలో పులుల ప్రస్థానం టర్కీ నుంచి రష్యా తూర్పు తీరం వరకు విస్తరించే ఉండేది. గడిచిన వందేండ్లలో పులులు తమ ఆవాసంలో 93 శాతం కోల్పోయాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత వల్ల, క్రూరమైన వేటగాళ్ల వల్ల వాటి జనాభా దాదాపు 97 శాతం మేరకు తగ్గిపోయింది.
పులుల సంరక్షణకు కఠిన చట్టాలు అవసరం
పులుల సంరక్షణ కోసం 1972లో కేంద్రం “ప్రాజెక్ట్ టైగర్'కు రూపకల్పన చేసింది. 1971 నాటికి మనదేశంలో పులుల సంఖ్య 1827 గా వుండేది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ టైగర్ 1973 నుంచి అమలులోకి వచ్చింది. అనంతరం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 2006లో సవరణ చేసి, జాతీయ పులుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 1993లో పులులు సంచరించే దేశాలన్నీ కలిసి గ్లోబల్ టైగర్ ఫోరంగా ఏర్పడ్డాయి. జాతీయంగా, అంతర్జాతీయ పులుల సంరక్షణకు కృషి చేయడానికి సంకల్పం తీసుకున్నాయి.
ఇక మనదేశంలో పులుల సంరక్షణ కోసం 2023 నాటికి వివిధ రాష్ట్రాలలో కలిపి మొత్తం 75000 చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 54 టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఏర్పాటు చేసింది. 1970వ దశకంలో 1827గా వున్న మన దేశ పులుల సంఖ్య 2000 సంవత్సరానికి 3000లకు చేరుకుంది. ప్రస్తుతం 2024 సంవత్సరానికి గాను మనదేశంలో మొత్తం 3682 పెద్ద పులుల జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో దాదాపు 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, 2015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచిర్యాల జిల్లా జన్నారంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వుంది. ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. పులుల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి.
భారత్‌లో గణనీయంగా ఉన్న పులులు
1913 నాటి లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు లక్ష పులులు ఉండేవి. 2010 నాటికి వాటి సంఖ్య 3,200కు పడిపోయింది. 2015 లెక్కల ప్రకారం పులుల సంఖ్య దాదాపు 3,890కి చేరుకుంది. గడిచిన వందేండ్లలో పులుల సంఖ్యలో తొలిసారిగా నమోదైన పెరుగుదల ఇది. ప్రస్తుతం 2023 లెక్కల ప్రకారం ప్రపంచంలో మొత్తం పులులు 5,575గా ఉన్నట్లు సమాచారం.
వీటిలో ఒక్క భారతదేశంలోనే అత్యధికంగా దాదాపు 3,167, రష్యాలో 750, ఇండోనేసియాలో 400, నేపాల్‌లో 355, థాయ్‌లాండ్‌లో 189, భూటాన్‌లో 151, మలేషియాలో 150, బంగ్లాదేశ్‌లో 146, మయన్మార్‌లో 22, చైనాలో 20, వియత్నాంలో 5 వరకు పులుల జనాభా ఉన్నట్లు సమాచారం. గత 15 సంవత్సరాల్లో భారతదేశం, నేపాల్ దేశంలో పులుల సంఖ్య పెరుగుదల ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
- మోతె రవికాంత్,
‘సెఫ్’ వ్యవస్థాపక
అధ్యక్షుడు