- చర్యలు తీసుకోవాలంటూ పీఎస్‌లలో ఫిర్యాదులు
వెలుగు నెట్వర్క్: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సుమన్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. సుమన్‌పై చర్యలు తీసుకోవాలంటూ పలు ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి గద్దెరాగడి అమ్మగార్డెన్ ఏరియాలోని నేషనల్హైవేపై సుమన్ ఫొటోకు చెప్పుల దండలు వేసి ఊరేగించిన తర్వాత దహనం చేశారు. సుమన్‌ను అరెస్టు చేయాలని మాజీ విప్ నల్లాల ఓదెలు డిమాండ్ చేశారు. సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో వేసుకోవడానికి బట్టలు కూడా లేని సుమన్ వందల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే చెప్పుల దండలు వేసి ఊరేగిస్తామని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ హెచ్చరించారు. మహబూబాబాద్ నెహ్రూ సెంటర్లో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సుమన్ ను ప్రేరేపిస్తున్న కేటీఆర్ పద్ధతి మార్చుకోవాలన్నారు. తర్వాత మహబూబాబాద్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పదేండ్ల కింద కేసీఆరే మాటలనే రేవంత్‌రెడ్డి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరులో మాట్లాడుతూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తిరగనివ్వమన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరి తరం కాదని, పక్కనే ఉండి బాల్క సుమన్ తో మాట్లాడించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఈ విషయం తెలియాలన్నారు.
Also Read :పార్లమెంట్ బరిలో జీవన్‌రెడ్డి.!