పాట్నా: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. బీహార్, హర్యానాలో నిరసనలు హింసాత్మకమయ్యాయి. రైలు, రోడ్డు మార్గాలను ఆందోళనకారులు బ్లాక్ చేశారు. బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే ట్రాక్‌లపై పడుకుని నిరసనలు తెలిపారు. కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లలో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు. బీహార్‌లో ఓ రైలు అద్దాలను పగులగొట్టి చేసి, బోగీకి నిప్పుపెట్టారు. ఎమ్మెల్యే కారును అడ్డగించి దాడి చేశారు. చాలా చోట్ల పోలీసులపై రాళ్లు రువ్వారు. హర్యానాలో మూకను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. బుధవారం బీహార్‌లో మొదలైన నిరసనలు మెల్లగా దేశమంతటా పాకుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. అగ్నిపథ్ విషయంలో ఉన్న అపోహలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అగ్నివీర్ సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు.
బీహార్ రణరంగం
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో వరుసగా రెండో రోజూ ఆందోళనలు జరిగాయి. పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనలు, తర్వాత విధ్వంసం జరగడంతో 34 ట్రైన్లను పూర్తిగా, 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 72 రైళ్లను ఆలస్యంగా నడిపించారు.ఐదు రైళ్లను మధ్యలోనే స్టేషన్లలో ఆపేశారు. భాభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీ అద్దాలను నిరసనకారులు పగులగొట్టారు. ఒక బోగీకి నిప్పు పెట్టారు. ‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకున్న యువకులు.. కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవాడాలో బీజేపీ ఎమ్మెల్యే అరుణా దేవి.. కోర్టుకు వెళ్తుండగా నిరసనకారులు అడ్డుకున్నారు. ఆమె వెళ్తున్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. నవాడాలోని బీజేపీ ఆఫీసు ధ్వంసమైంది. నవాడాలో కొందరు యువకులు రోడ్లపై టైర్లు అంటించారు. స్థానిక రైల్వే స్టేషన్‌ను బ్లాక్ చేశారు. ట్రాకులపైనా టైర్లకు నిప్పుపెట్టారు. రైల్వే ప్రాపర్టీని ధ్వంసం చేయడం వీడియోల్లో కనిపించింది. కొందరు ట్రాక్‌లపై పుషప్స్ తీస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అర్రా రైల్వే స్టేషన్‌లో రాళ్లు రువ్విన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రైల్వే స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ట్రాకులపై పడేసిన ప్రొటెస్టర్లు.. వాటికి నిప్పు పెట్టారు. మంటలను ఆర్పేందుకు రైల్వే స్టాఫ్ ప్రయత్నిస్తుండటం పలు వీడియోల్లో కనిపించింది. జెహనాబాద్‌లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన స్టూడెంట్లను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో స్టూడెంట్లు రాళ్లు రువ్వగా పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. స్టూడెంట్లు, పోలీసులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి. సహర్సాలోనూ పోలీసులపై స్టూడెంట్లు రాళ్లు రువ్వారు. చప్రాలో మూక హింసకు దిగింది. పెద్దపెద్ద కర్రలను చేతబట్టుకుని ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. బుధవారం ముజఫర్‌పూర్, బక్సర్ జిల్లాల్లో నిరసనలు జరిగాయి.
- రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) ఆధ్వర్యంలో వందలాది మంది రాజస్తాన్‌లో నిరసనలు చేశారు. జోధ్‌పూర్, సికర్, జైపూర్, నాగ్‌పూర్, అజ్మీర్, ఝున్‌ఝును జిల్లాల్లో ర్యాలీలు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు చెప్పారు.
- యూపీలోని ఆగ్రా, అలీగఢ్‌లో బస్సులపై రాళ్లు రువ్వారు. బులంద్‌షహర్, బల్లియా జిల్లాల్లో యువకులు నిరసనలు చేశారు. వారి డిమాండ్లను సంబంధిత అధికారులకు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
- హర్యానాలోని పల్వాల్ జిల్లాలో ఆర్మీ అభ్యర్థులు రాళ్లు రువ్వారు. పోలీసులపై కొందరు దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మూకను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సర్వీసులను 24 గంటల పాటు నిలిపేశారు. గురుగ్రామ్, రేవారి జిల్లాల్లోనూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. గురుగ్రామ్‌లోని బిలాస్‌పూర్, సిధ్రావలీలో బస్‌స్టాండ్లు, రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో గురుగ్రామ్– జైపూర్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
- ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఔటర్ ఢిల్లీలోని నంగ్‌లోయ్ రైల్వే స్టేషన్‌లో రైలును కొందరు యువకులు అడ్డుకున్నారు. ట్రాక్‌పై పడుకుని నిరసన తెలిపారు.
నిరుద్యోగులకు అగ్నిపరీక్ష పెట్టొద్దు: రాహుల్
నిరుద్యోగ యువతకు అగ్నిపథ్‌తో అగ్నిపరీక్ష పెట్టొద్దు. యువత గళాన్ని మోడీ వినిపించుకోవాలి. రెండేండ్ల పాటు ఎటువంటి ర్యాంకు, పెన్షన్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేయకుండా, నాలుగేండ్ల తర్వాత వారికి ఎటువంటి భవిష్యత్ ఉండదు.
ఫుల్‌టైం జాబ్స్ కావాలె: కేజ్రీవాల్
నాలుగేండ్లు కాదు.. ఫుల్‌టైం జాబ్స్ కావాలె. అగ్నిపథ్స్కీముతో నిరుద్యోగ యువత ఆగ్రహంగా ఉన్నారు. దేశానికి నాలుగేండ్ల పాటు కాక జీవి తాంతం సేవ చేయాలని యువత భావిస్తున్నారు.
యువతలో అసంతృప్తి: వరుణ్‌గాంధీ
సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేయడం ఏంటి..? దీనిపై యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మోడీ స్పందించాలి.
ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యమిస్తం: బీజేపీ సీఎంలు
అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్లు అగ్నివీర్‌లుగా పని చేసి రిటైర్ అయిన వారికి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామని పలు బీజేపీ రాష్ట్రాల సీఎంలు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండు, త్రిపుర సీఎం మాణిక్ సాహా ప్రకటనలు చేశారు.
అగ్నిపథ్.. నిజాలివీ
అగ్నిపథ్ స్కీమ్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ‘అపోహలు – నిజాలు’ పేరుతో డాక్యుమెంట్ రిలీజ్ చేసింది.
సందేహం
నాలుగేండ్లు మాత్రమే జాబ్ ఉంటుం దంటున్నారు. ఇది చాలా తక్కువ. భవిష్యత్తుకు భరోసా ఉండదు.
క్లారిటీ
నాలుగేండ్ల తర్వాత పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి ఆర్థిక ప్యాకేజీ ఇస్తారు. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది. పై చదువులకు వెళ్లాలని అనుకునే వారికి 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్‌ను అందజేస్తారు. తదుపరి చదువుల కోసం బ్రిడ్జి కోర్సు కూడా ఉంటుంది. ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లకు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), రాష్ట్ర పోలీసు విభాగాల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఇతర రంగాల్లోనూ అవకాశాలు ఉంటాయి.
సాయుధ దళాల్లో పని చేయాలను కునే వారికి ఛాన్స్‌లు తగ్గుతాయి.
అట్లేం కాదు.. ఇంకా పెరుగుతాయి. ఇప్పటితో పోలిస్తే రాబోయే ఏండ్లలో అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ 3రెట్లు పెరుగుతుంది.
రెజిమెంటల్ బాండింగ్‌పై ప్రభావం పడుతుంది.
రెజిమెంటల్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు జరగవు. అగ్నివీర్‌లలో ఉత్తమమైన వారిని ఎంపిక చేయడం వల్ల ఇది మరింత బలోపేతం అవుతుంది. యూనిట్ మరింత క్వాలిటీగా ఉంటుంది.
సాయుధ దళాల సమర్థత దెబ్బతింటుంది.
ఇదొక అపోహ మాత్రమే. తొలి ఏడాది రిక్రూట్ చేసే అగ్నివీర్‌ల సంఖ్య.. సాయుధ దళాల్లోని మొత్తం ఫోర్స్‌తో పోలిస్తే 3 శాతమే. అంతే కాదు.. అగ్నివీర్‌లను ఆర్మీలోకి చేర్చుకోవడానికి ముందు.. వారి పనితీరును పరీక్షిస్తారు. దీంతో అప్పటికే పరీక్షించిన, పని చేసిన సిబ్బంది ఆర్మీకి దొరుకుతారు. ఇలాంటి షార్ట్‌టర్మ్ సిస్టమ్ చాలా దేశాల్లో ఇప్పటికే ఉంది. యువతతో కూడిన, చురకైన ఆర్మీకి ఇదే సరైన పద్ధతిని రుజువైంది.
21 ఏండ్ల యువతకు మెచ్యూరిటీ ఉండదు. వాళ్లపై సైన్యం ఆధారపడటం అవివేకమే.
ప్రపంచంలోని ఆర్మీలన్నీ తమ యువతపైనే ఆధారపడి ఉన్నాయి. ఎలా చూసుకున్నా అనుభవజ్ఞుల కంటే.. యువకులు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం పథకం.. సుదీర్ఘ కాలం పాటు చాలా నెమ్మదిగా యువ సైనికులు, పెద్దాఫీసర్ల సంఖ్య 50:50 నిష్పత్తిలో ఉండేలా చేస్తుంది.
ఉద్యోగంలో భాగంగా ఆయుధ శిక్షణ పొందిన 21 ఏళ్ల యువకులకు తర్వాత ఉద్యోగం లేకపోతే తీవ్రవాద గ్రూపులు లేదా దేశ వ్యతిరేక శక్తులతో కలిసే ప్రమాదం ఉంది.
ఇది భారత సాయుధ దళాల నైతికత, విలువలను అవమానించడమే. సైన్యం యూనిఫామ్ వేసుకున్న సైనికులు.. తమ జీవితం మొత్తం దేశం కోసం నిబద్ధతతో ఉంటారు. ఇప్పటిదాకా వేల మంది రిటైర్ అయ్యారు. కానీ దేశ వ్యతిరేక శక్తులతో కలిసిన ఒక్క ఘటన కూడా జరగలేదు.