సుంకె రవిశంకర్.. గో బ్యాక్

  • సుంకె రవిశంకర్..గో బ్యాక్
  • నీలోజిపల్లిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు  
  • వరదవెల్లిలో బీఆర్ఎస్​కండువాల దహనం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి అర్అండ్ఆర్ కాలనీలో చొప్పదండి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ కు నిర్వాసితుల నుంచి నిరసన ఎదురైంది. సోమవారం మిడ్ మానేర్  ముంపు గ్రామాలైన నీలోజిపల్లి, కొదురుపాక, వరదవెల్లి అర్అండ్ఆర్ కాలనీల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. నీలోజిపల్లిలో మాట్లాడుతుండగా నిర్వాసితులు మిడ్ మానేర్ ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరికి పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. 

కొద్దిసేపటికి ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించుకొని ప్రచారరథం దిగి వెళ్తుండగా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలు వారిని నెట్టివేశారు. వరదవెల్లిలో ప్రచారం తర్వాత నిర్వాసితులు, మహిళలు ముంపు  గ్రామాల సమస్యలు పరిష్కరించలేదని బీఆర్ఎస్ కండువాలు తగులబెట్టారు. ప్రచారం సందర్భంగా కొందరు నిరసన తెలిపారని, దాడికి కూడా యత్నించారని, ఏం చేస్తున్నారని ఎస్ఐ శ్రీకాంత్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ అభ్యర్థే దాడి చేయించిండు

కాంగ్రెస్​అభ్యర్థి మేడిపల్లి సత్యం తనపై దాడి చేయించాడని రవిశంకర్ ఆరోపించారు. వరదవెల్లి ఆర్ఆర్ఆర్ కాలనీలో మాట్లాడుతూ నీలోజిపల్లిలో కాంగ్రెస్ లీడర్లు తన ప్రచారానికి అడ్డుపడి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను డిమాండ్ ​చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని, ఆ టైంలో పోలీసులు వీడియో తీస్తున్నారే తప్ప అడ్డుకోలేదన్నారు.