మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్​ హుస్సేన్​కు నిరసన సెగ

దుబ్బాక, వెలుగు :   దుబ్బాక బీఆర్ఎస్ ​అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్​హుస్సేన్​కు చేదు అనుభవం ఎదురైంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్​ గ్రామానికి వచ్చిన ఆయన ప్రభుత్వ అభివృద్ధి పనుల గురించి మాట్లాడకుండా ఎమ్మెల్యే రఘునందన్​రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆయన ప్రసంగాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

రెండు సార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్​రెడ్డి ఒక్కసారి కూడా తమ గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఆ పార్టీ తరపున ఏ మొఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే రఘునందన్​రావే అని ఎమ్మెల్సీ అన్నారు. దీంతో ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి గ్రామానికి ఏం చేశారో చెప్పాలని బీజేపీ లీడర్లు ప్రశ్నించారు.

ALSO READ: రోడ్డు వేయలే.. మళ్లీ ఎందుకొచ్చావ్..? మహేశ్​రెడ్డిని నిలదీసిన తండా వాసులు 

 ప్రశ్నించే గొంతుతోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ ​కార్యకర్తలకు, బీజేపీ శ్రేణుల మధ్య  తోపులాట జరిగింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.