రణరంగంగా బంగ్లాదేశ్

రణరంగంగా బంగ్లాదేశ్
  • జాబ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు
  • ప్రభుత్వ ఆఫీసులకు నిప్పుపెట్టిన నిరసనకారులు 
  • ఇప్పటి వరకు 105 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి స్టూడెంట్లు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని ఢాకాతో పాటు కొన్ని నగరాల్లో విద్యార్థులకు, అధికార పార్టీ అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఆందోళనలు సోమవారం నుంచి పెరిగిపోయాయి. కట్టెలు, ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 105 మంది చనిపోయారు. మరో 2,500 మందికి పైగా గాయపడ్డారు.

బంగ్లా వర్సిటీలలో చదువుతున్న భారత విద్యార్థుల్లో 300 మంది స్వదేశానికి వెళ్లారు. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు శుక్రవారం పెద్ద సంఖ్యలో యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాల మేరకు ఢాకాలో రంగంలోకి దిగిన ఆర్మీ.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపింది. చాలాచోట్ల ఇంటర్​నెట్ సేవలు నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూల్స్, కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

గవర్నమెంట్ వెబ్​సైట్లు హ్యాక్​

ఆందోళనకారుల దాడుల్లో పలు ప్రభుత్వ భవనాలు ధ్వంసం అయ్యాయి. ప్రభుత్వ టీవీ ఛానల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాబన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్​పై వెయ్యి మంది నిరసనకారులు దాడి చేశారు. కార్లు, బైక్​లకు నిప్పు పెట్టారు. సెంట్రల్ బ్యాంకు, పలు గవర్నమెంట్ ఆఫీసులు, పీఎంవోతో పాటు పోలీస్ డిపార్ట్​మెంట్ వెబ్​సైట్లు హ్యాక్ అయ్యాయి.

హింసకు కారణమేంటి?

బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాతంత్య్రం కోసం 1971లో పాకిస్తాన్​తో జరిగిన యుద్ధంలో చాలా మంది చనిపోయారు. అమరులైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్పిస్తున్నట్టు 1972లో ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రకటించారు. వంద శాతంలో 44% మెరిట్ ఆధారంగా, 56 శాతం రిజర్వేషన్ల పరంగా (30శాతం అమరుల కుటుంబాలకు) ఉద్యోగాల భర్తీకి నిర్ణయించారు.

కాగా, రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలని స్టూడెంట్లు నిరసన చేపడ్తున్నారు. గత నెల జూన్ 5న 30శాతం కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పు.. షేక్ హసీనా మద్దతుదారులకు ప్రయోజనం చేకూరుస్తున్నదని స్టూడెంట్లు వాదిస్తున్నారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఆగస్టు 7న విచారించనుంది.