- మా కష్టాలు ఎప్పుడైనా పట్టించుకున్నారా.. అంటూ మహిళా కార్మికుల నిలదీత
- మాట్లాడకుండానే వెళ్లిపోయిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
- వీడియో తీస్తుండగా ఫోన్ గుంజుకుని డిలీట్ చేసిన కోరుకంటి చందర్
- ఏసీ రూముల్లో ఉండే మీకు మా గురించి ఏం తెలుస్తుందని ఫైర్
- మాట్లాడకుండానే వెళ్లిపోయిన పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి
- జీడీకే –1 గనిపై ఘటన
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం సింగరేణి బొగ్గు గనిపై ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు నిరసన తెగ తగిలింది. ‘మా కష్టాలను ఎప్పుడైనా పట్టించుకున్నారా’ అంటూ మహిళా కార్మికులు ఆయనను నిలదీశారు. దీంతో కార్మికులతో మాట్లాడడానికి వచ్చిన ఆయన చివరకు మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కార్మికుడి దుస్తులు ధరించి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకెఎస్లీడర్లతో కలిసి సింగరేణి జీడికే 1వ గని వద్దకు చేరుకున్నారు. కార్మికులతో మాట్లాడి వారితో ఫొటోలు దిగడానికి సిద్ధమవుతుండగా మహిళా కార్మికులు తమ సమస్యల గురించి వారిని ప్రశ్నించారు. ‘సింగరేణిలో ఏ డివిజన్లో చేయని విధంగా ఆర్జీ –1 ఏరియా వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న 50 మంది మహిళా కార్మికులను బొగ్గు గనుల్లో పనిచేయడానికి ట్రాన్స్ఫర్ చేశారని, అమ్మాయిలు ఇక్కడ ఎంత కష్టంతో పనిచేస్తున్నారో మీకేం తెలుసు? కొంత మంది కళ్లు తిరిగి పడిపోతున్నారు.
మహిళా కార్మికుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలా మంది వయస్సు మీద పడ్డ కార్మికులు బొగ్గు గని లోపలికి వెళ్లి పనిచేస్తుంటే..మీ పేర్లు చెప్పుకుని కొంతమంది పైనే పనిచేస్తున్నరు. ఏసీ రూమ్‌లలో ఉండే మీకు మా కష్టాలు ఎలా తెలుస్తాయి? మేము కష్టాలు పడుతుంటే ఎప్పుడైనా పట్టించుకున్నారా ?’ అని కొప్పుల ఈశ్వర్‌ను నిలదీశారు. దీంతో ప్రచారం చేయకుండానే ఆయన వెళ్లిపోవాల్సి వచ్చింది.
మాజీ ఎమ్మెల్యే ప్రవర్తన కరెక్ట్ కాదు : రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్
మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్...వీడియో జర్నలిస్ట్శివ సెల్‌ఫోన్ లాక్కుని అందులో నుంచి దృశ్యాలను తొలగించడాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఖండించారు. జర్నలిస్ట్‌లతో ఎలా ప్రవర్తించాలో మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలని సూచించారు. కోరుకంటి చందర్ ప్రవర్తన కరెక్ట్ కాదని, ఈ ఘటనను జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాలని కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా కార్మికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారి పట్ల టీబీజీకేఎస్ లీడర్లు దుసురుగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటూనే మరో వైపు ఆ పార్టీకి చెందిన వారితోనే ఎన్నికల ప్రచారంలో టీబీజీకేఎస్లీడర్లు పాల్గొంటూ వారి నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారన్నారు. దీనిని సింగరేణి కార్మిక వర్గం గమనించాలని ఎమ్మెల్యే కోరారు.
ఫోన్ గుంజుకుని...వీడియో డిలీట్ చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి
మా కష్టాలు పట్టించుకోలేదంటూ కొప్పుల ఈశ్వర్‌ను మహిళా కార్మికులు నిలదీస్తుండగా ఓ ఛానెల్‌కు చెందిన వీడియో జర్నలిస్ట్ శివ చిత్రీకరించాడు. దీన్ని గమనించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సదరు వీడియో జర్నలిస్ట్ వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని అందులో ఉన్న వీడియో తొలగించారు.