పెద్దపల్లిలో మంత్రి కొప్పులకు నిరసన సెగ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గర్ల్స్​జూనియర్​కాలేజీ స్టూడెంట్ల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్​కు నిరసన సెగ తగిలింది. ఆరేండ్ల కింద శిథిలమైన కాలేజీ భవనం స్థానంలో కొత్తది కడ్తారని భావిస్తుండగా, అదే స్థలంలో పబ్లిక్​ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన కోసం గురువారం మంత్రి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల నేతలు మంత్రిని అడ్డుకునేందుకు కాలేజీ క్యాంపస్​లో గుమిగూడారు. ‘మినిస్టర్​గోబ్యాక్’​ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు స్టూడెంట్లను చెదరగొట్టారు. 

పలువురిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. కాలేజీ క్యాంపస్ ను​ పూర్తిగా తమ కంట్రోల్​లోకి తెచ్చుకున్న తర్వాత  మంత్రి కొప్పులకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి జిల్లా లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, సంఘాల నాయకులు మాట్లాడారు. ‘‘ఆరేండ్ల కింద బాలికల కాలేజీ భవనం శిథిలమైంది. కొత్త భవనం నిర్మాణానికి ప్రపోజల్స్​ పంపినా మంజూరు కాలేదు. రెండేండ్లుగా గర్ల్స్​కాలేజీని పూర్తిగా మూసివేసి, బాయ్స్​కాలేజీ ల్యాబుల్లో కాలేజీ నడుపుతున్నారు. కొత్త బిల్డింగ్​ నిర్మాణం చేయాల్సి ఉండగా, అదే ప్లేస్​లో లైబ్రరీకి శంకుస్థాపన చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో లైబ్రరీ కట్టనియ్యమని హెచ్చరించారు.

 
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ను  బుధవారం రాత్రి నిరసన సెగ తగిలింది. బుధవారం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన యువకుడు కొత్తపెల్లి నరేశ్​ లేచి తనను మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాడు. దీంతో మంత్రి ఈశ్వర్​ మాట్లాడడం ఆపేసి అతడికి మైక్ ​ఇప్పించాడు. దీంతో నరేశ్​ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దళితుల పార్టీ అయితే  ఎంత మంది దళితులకు దళిత బంధు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించాడు. 

ఎంతమంది దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయో చెప్పాలని కోరాడు. అలాగే మాట్లాడుతుండడంతో  అక్కడికి పరిగెత్తుకొచ్చిన టీఆర్ఎస్ ​లీడర్లు మైక్​ లాక్కున్నారు.