ఆరు నెలలుగా జీతాలియ్యట్లే.. రెగ్యులర్​ చేయట్లే..

ఆరు నెలలుగా జీతాలియ్యట్లే.. రెగ్యులర్​ చేయట్లే..
  • 2016లో సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్
  • జాబ్ గ్యారెంటీ ఇవ్వాలని అన్ని జిల్లాల్లో సిబ్బంది మెరుపు సమ్మె
  • గతేడాది నవంబర్​లో 104 వ్యవస్థ రద్దు
  • సిబ్బందిని వేర్వేరు డిపార్ట్​మెంట్లకు సర్దుబాటు చేసిన ప్రభుత్వం

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న 104 వెహికల్​సిబ్బంది ఆగమవుతున్నారు. గతేడాది నవంబర్​లో 104 వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అందులో పనిచేస్తున్న 1,350 మంది ఔట్​సోర్స్​సిబ్బందిని జిల్లా హాస్పిటల్స్, పీహెచ్​సీలు, మెడికల్​కాలేజీలు ఇతర మెడికల్​ఆఫీసులకు సర్దుబాటు చేసి వదిలేసింది. 

తర్వాత వారిని పట్టించుకోలేదు. గతంలో మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే కాంట్రాక్ట్​సంస్థ గడిచిన ఆరు నెలలుగా ఇవ్వడం లేదు. టైంకు జీతాలు రాక, 15 ఏండ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం రెగ్యులర్​చేయక సిబ్బంది నరకయాతన పడుతున్నారు. 2016లో సీఎం కేసీఆర్​ఇచ్చిన హామీ ప్రకారం తమను పర్మినెంట్​చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ శనివారం మెరుపు సమ్మెకు దిగారు. మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో 104 సిబ్బంది నిరసనలు కొనసాగిస్తున్నారు.

15 ఏండ్లుగా పనిచేస్తున్నా.. 

2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 104 వెహికల్స్​ను అందుబాటులోకి తెచ్చింది. ఆ టైంలో తాత్కాలికంగా కొందరిని నియమించింది. 2011లో వారంతా సమ్మెకు దిగారు. 2012లో డిస్ట్రిక్ట్​ సెలక్షన్ కమిటీ  డీఎస్సీ వేసి, రూల్​ఆఫ్​రిజర్వేషన్ ద్వారా 104లో పనిచేసేందుకు ఔట్​సోర్సింగ్ కింద ఫార్మాసిస్టులు, ల్యాబ్​టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు(పైలెట్లు), సెక్యూరిటీ గార్డులను నియమించింది. అలా తెలంగాణలో 1,350 మంది104 సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా వారికి నిర్దేశించిన రోజున వెహికల్స్ తో గ్రామాలకు వెళ్లి హైపర్​టెన్షన్, డయాబెటిస్, ఎపిలెప్సీ, ఆస్తమా, బ్రాన్​సైటిస్, చిన్న పిల్లలకు ఆరోగ్య టిప్స్, గర్భిణులకు, స్ర్తీలకు నెలవారి టెస్టులు చేసి మందులు ఇచ్చేవారు. 

అయితే తెలంగాణ ప్రభుత్వం 2021, నవంబర్​లో 104 వ్యవస్థను రద్దు చేసింది. ఇందులో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​సిబ్బందిని రీడిప్లాయిడ్ కింద ఫార్మాసిస్టులు, ల్యాబ్​ టెక్నీషియన్లను పీహెచ్​సీలకు, జిల్లా హాస్పిటల్స్​కు అలాట్​చేసింది. డ్రైవర్లను మెడికల్​ కాలేజీలు, టి–హబ్, డీఎంహెచ్ఓ ఆఫీసులకు,డేటా ఎంట్రీ ఆపరేటర్లను డీఎంహెచ్ఓ ఆఫీసులకు కేటాయించింది. 15 ఏండ్లుగా సేవలందిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది సమ్మెకు
 దిగారు.

వర్తించని టీఏ, డీఏ

పీహెచ్ సీలు, హాస్పిటళ్లకు అలాట్ అయిన సిబ్బంది డెయిలీ డ్యూటీకి వెళ్లేందుకు 60 నుంచి 70 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వస్తోంది. రానూ.. పోనూ రూ.250 నుంచి రూ.350 వరకు ఖర్చు అవుతోంది. నెలకు రూ.6 వేల నుంచి రూ.9వేల వరకు దారి ఖర్చులకే పోతోందని సిబ్బంది వాపోతున్నారు. రెగ్యులర్ ల్యాబ్​టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మాసిస్టులు, డ్రైవర్లు, హెల్పర్లకు టీఏ, డీఏలు ఇస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. పైగా కాంట్రాక్ట్​ కంపెనీ104 సిబ్బందికి ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదు. 

గవర్నమెంట్​బడ్జెట్​రిలీజ్​చేయకపోవడంతోనే జీతాలు ఆగాయని సమాచారం. జీతాల కోసం మూడు నెలలుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే రెగ్యులర్​చేసి, ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్​చేస్తున్నారు. సిబ్బందిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలంటున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను, కంప్యూటర్​ఆపరేటర్లుగా గుర్తించాలని, హెల్త్​కార్డు లేదా బీమా వర్తింపజేయాలని కోరుతున్నారు. 

మా సేవలను గుర్తిస్తలేరు..

15 ఏండ్లుగా 104లో డ్యూటీలు చేస్తున్నాం. ఇంత వరకు మా సేవలను ప్రభుత్వం గుర్తించలేదు. కరోనా టైంలో ప్రజలకు ఎంతో సేవ చేశాం. అయినప్పటికీ మా మీద కనికరం చూపడం లేదు. పర్మినెంట్​చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వం స్పందించకుంటే.. ఆందోళనలను ఉధృతం చేస్తాం. 
– వి.విజయవర్ధన్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయ్స్​యూనియన్

కుటుంబాలను  ఎలా పోషించాలి

ఆరు నెలలుగా మాకు జీతాలు రావడం లేదు. గతంలో మూడు నెలలకోసారి ఏజెన్సీ కంపెనీ జీతాలు ఇచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. జీతాలు ఇవ్వకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? ప్రభుత్వం స్పందించి, ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి.
- ఎం.వేణు, మహబూబ్​నగర్​ జిల్లా కార్యదర్శి, తెలంగాణ యునైటెడ్​ మెడికల్​ ఎంప్లాయిస్​ యూనియన్