రోడ్డుపై మంచం వేసుకొని నిరసన

రోడ్డుపై మంచం వేసుకొని నిరసన

ముత్తారం, వెలుగు: దుమ్ము, ధూళితో తమ ఇండ్లు నిండి పోతున్నాయంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామస్తుడు రోడ్డుపై మంచం వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. తాడిచర్ల బ్లాక్ 1,2 ఇసుక క్వారీల నుంచి వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. 

లారీలతో ప్రతి రోజు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామానికి చెందిన కర్రె రాంచంద్రం నడి రోడ్డుపై  మంచం వేసుకొని నిరసన తెలిపాడు. ఇసుక లారీల వల్ల తాగే నీటిలో, తినే అన్నంలో దుమ్ము పడుతోందని వాపోయాడు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది లారీలు తిరగడంతో రోడ్డంతా గుంతలు పడ్డాయని పేర్కొన్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరాడు.