జైపూర్, వెలుగు: ధాన్యం దించుకోవడం లేదని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం వరలక్ష్మి రైస్ మిల్ ఎదుట రాష్ట్ర రహదారి పై లోడ్‌తో ఉన్న లారీలను అడ్డంగా పెట్టి డ్రైవర్లు ధర్నా చేశారు. ధర్నాకు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు మార్షల్ దుర్గం నగేశ్మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ చెన్నూరు, భీమారం, జైపూర్, కోటపల్లి, నీల్వాయి, కన్నెపల్లి, భీమిని, బెల్లంపల్లి తదితర కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు సుమారు 48 లారీల వడ్లను జైపూర్ మండలంలోని ఇందారం వరలక్ష్మి రైస్‌మిల్లుకు పంపించారని, వచ్చి ఆరు రోజులవుతున్నా దించుకోవడం లేదన్నారు. దీంతో డ్రైవర్లు దుమ్ము, ధూళి మధ్య తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అడిగితే వడ్లలో తేమ ఉందని, స్థలం లేదని, హమాలీలు లేరని చెబుతున్నారన్నారు.
అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయీస్ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడిన నగేశ్వడ్లు దించుకునే విధంగా చూడాలని కోరారు. హమాలీల కొరతతో ఆలస్యమవుతోందని, తొందరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమతా సైనిక దళ్ నాయకులు బండారి శివశంకర్, రామటంకి మల్లేశ్, చందనగిరి శివరామకృష్ణ, మేకల లింగయ్య, కోల్ బెల్ట్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాందేవి రమేశ్, లారీ ఓనర్స్ బాబా, ఆవుల శ్రీను, హరిబాబు, అశోక్ పాల్గొన్నారు.