![రోడ్డుపై పశువులను తోలి ఆందోళన...కవ్వాల్జోన్ లోకి ఫారెస్టు ఆఫీసర్ల ఆంక్షలతో నిరసన](https://static.v6velugu.com/uploads/2025/02/protest-erupts-in-kawal-tiger-zone-over-forest-officials-restrictions_m5gCMPnbWl.jpg)
- వాహనాలను అనుమతించాలని బంద్ పాటించిన జన్నారం వ్యాపారులు
జన్నారం/జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్టైగర్జోన్పరిధిలో పశువుల మేత, రాత్రిపూట వాహనాల రాకపోకలపై ఫారెస్టు అధికారులు ఆంక్షలు విధించడంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. మంగళవారం ఇందన్పల్లి బీట్పరిధిలో పశువులను మేపడానికి వెళ్లిన అలుగొట్టు రాజన్నను బీట్ఆఫీసర్రుబీనా కర్రతో కొట్టారు. దీనికి నిరసనగా రాజన్న, అతడి భార్య బుధవారం మంచిర్యాల -– ఆదిలాబాద్ –- నిర్మల్మెయిన్రోడ్డుపై పశువుల మందను తోలి రాస్తారోకో చేశారు.
దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రెండు వైపులా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్ ఐ రాజవర్ధన్ వెళ్లి ఇందన్పల్లి ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌తో మాట్లాడిన అనంతరం రాజన్న దంపతులను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. మరోవైపు కవ్వాల్టైగర్జోన్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్‌చేస్తూ జన్నారం బంద్చేపట్టారు.
వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులను మూసివేశారు. బీఆర్ఎస్నేతలు, వ్యాపారులు ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తేయాలని ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రెండు రోజుల కింద అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి ఫారెస్టు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు వాహనాలను అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు.