కమ్యూనిస్టు పార్టీకి అందరూ సమానమే

  • అడ్డుకోబోయిన కృష్ణయ్య కుటుంబసభ్యులు
  • ఇంట్లోనే దిగ్బంధించిన పోలీసులు

ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు నిరసన సెగ తగిలింది. టీఆర్ఎస్​ నాయకుడు, ఆంధ్రాబ్యాంక్​ డైరెక్టర్​ తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన తరువాత మొదటిసారి తమ్మినేని వీరభద్రం గ్రామానికి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వీరభద్రం ర్యాలీగా తెల్దారుపల్లిలోకి వస్తుండగా కృష్ణయ్య ఇంటి ఎదురుగా ఆయన అనుచరులు, కుటుంబసభ్యులు అడ్డుకోబోయారు. కృష్ణయ్య కూతురు రజిత చెప్పు విసరబోగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారందరిని ఇంటి ఆవరణలో దిగ్బంధించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కృష్ణయ్య కుమారుడు నవీన్, కూతురు రజిత మీడియాతో మాట్లాడారు. తమ్మినేని వీరభద్రానికి తెల్దారుపల్లి గ్రామంలోకి అడుగుపెట్టడానికి అర్హత లేదని, హత్యా రాజకీయాలు చేస్తున్న ఆయన సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండే అర్హత కోల్పోయారని అన్నారు. సీపీఎం కేంద్ర నాయకత్వం ఆయనను తొలగించాలని డిమాండ్​ చేశారు. తమ తండ్రి హత్యలో సీపీఎం కార్యకర్తలు, ఆయన తమ్ముడు హస్తం ఉందని, దానిని కప్పిపుచ్చేందుకు వీరభద్రం ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

పార్టీకి అందరూ సమానమే: తమ్మినేని
తెల్దారుపల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉందని, గతంలో ఏ ఘటన జరిగినా గ్రామస్తులంతా కడుపులోనే దాచుకున్నారని తమ్మినేని వీరభద్రం అన్నారు. సొంత మనుషులైనా, పరాయి వాళ్లయినా కమ్యూనిస్టు పార్టీకి అందరూ సమానమే అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా గ్రామంలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో తమ్మినేని మాట్లాడుతూ బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వద్దని అన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండాలని, ఇకపై తాను తెల్దారుపల్లిలో అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకుందామన్నారు.