లగచర్ల దాడి వెనుక ఎవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రున్నా వదలొద్దు..దోషులను కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాలు

  • కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసుల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన  

హైదరాబాద్ సిటీ/బషీర్ బాగ్/వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా లగచర్లలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడిని రాష్ట్ర ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్ల జేఏసీ హైదరాబాద్ శాఖ తీవ్రంగా ఖండించింది. గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులంతా కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. లగచర్ల దాడి అప్రజాస్వామికమని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

ఆ సంఘాల అధ్యక్షులు నాయకులు ఎంబీ కృష్ణ యాదవ్, ఎస్.విక్రమ్ కుమార్, ఖాదర్, జి.ఆశన్న, కె.ఆర్.రాజ్ కుమార్, కె.శ్రీకాంత్, హరికృష్ణ, డాక్టర్ కె.విద్యాసాగర్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగ రవీందర్ రెడ్డి అధ్యక్షతన అబిడ్స్ భూ పరిపాలన భవన్ ముందు నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. లగచర్ల లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఉద్యోగుల జేఏసీ సెక్రెటరీ జనరల్ ఎలూరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొంతమంది రాజకీయ నాయకులు వెనుక ఉండి దాడికి ప్రేరేపించారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలతో ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. లగచర్ల ఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న వెనుక ఎవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రున్నా, ఎంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టి వారైనా ఉపేక్షించవద్దని కోరారు. జీహెచ్ఎంఈయూ ఆఫీస్​ముందు ప్లకార్డులతో ఉద్యోగులు, కార్మికులు నిరసనకు దిగారు. జీహెచ్ఎంఈయూ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దాడికి పాల్పడిన వారిపై క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠిన చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిమాండ్ చేశారు.

లగచర్ల దాడి వెనుక కుట్ర కోణం దాగి ఉందన్నారు. వైస్ ప్రెసిడెంట్లు జి.నర్సింగ్ రావు, కె.శేఖర్, అశోక్, వెంకటేశ్, నర్సింగ్ రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శివకుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్​కలెక్టరేట్​వద్ద ఉద్యోగులు, అధికారులు నిరసనకు దిగారు. జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా, జిల్లా కోశాధికారి రమేశ్, జాయింట్ సెక్రెటరీ హీరా లాల్, తాలూకా ప్రెసిడెంట్ మల్లేశం, పరిగి తాలూకా ప్రెసిడెంట్ వెంకటేశ్, క్లాస్ ఫోర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, పెన్షనర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.