ఖమ్మం, వెలుగు: రాష్ట్రానికి నేషనల్ హైవేల మంజూరు, రైల్వే ప్రాజెక్టులు, ఉపాధి హామీ నిధుల మంజూరులో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం డీపీఆర్సీ భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ కమల్ రాజు హాజరయ్యారు. డిపార్ట్ మెంట్ల వారీగా కేంద్ర పథకాల అమలును ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనుల్లో కేంద్రం ఆంక్షలు పెట్టడం, అధికారులకు నోటీసులు ఇవ్వడంపై మీటింగ్ లో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తున్నట్లు మినిట్స్ బుక్‌లో రికార్డు చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. పేద కూలీల పొట్ట కొట్టేందుకు కేంద్రం ప్లాన్ చేసిందని అన్నారు. దీనిపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడతానని చెప్పారు.
పలు అంశాలపై చర్చ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ దుర్గా ప్రసాద్ జిల్లాలో జరుగుతున్న నాలుగు హైవేల పనుల పురోగతిని వివరించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి కావడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉందని, కాబట్టి ఖమ్మం నుంచి తల్లాడ వరకు ఉన్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని, వైరా మున్సిపాలిటీతో పాటు తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఖమ్మం, సూర్యాపేట హైవేకు సంబంధించి స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్స్ ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. పొన్నెకల్ నుంచి మద్దులపల్లి వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉందని, దాన్ని వెంటనే నాలుగు లేన్లుగా విస్తరించాలని కోరారు. ఎంపీ నామా మాట్లాడుతూ ఖమ్మం, సూర్యాపేట హైవే పనులు పూర్తి కాకుండానే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ ప్రకటిస్తే అడ్డుకుంటామని సీరియస్ గా చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో హైవేల పనులను పరిశీలిస్తామని తెలిపారు. కొత్తగూడెం - చిల్లకల్లు, భద్రాచలం- అశ్వారావుపేట, ఏటూరు నాగారం - భద్రాచలం, ఇల్లందు,- బోనకల్, జగ్గయ్యపేట రహదారులను నేషనల్ హైవేలుగా మార్చేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. హైవేలకు అవసరమైన మట్టిని సమీపంలోని చెరువుల పూడిక తీసి తరలించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. స్పందించిన ఎంపీ ప్రభుత్వానికి కూడా రాయల్టీ వస్తుందని, ఈ విషయాన్ని పరిశీలించాలని కలెక్టర్ గౌతమ్‌కు సూచించారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారి మీటింగ్ కు రాకుండా డివిజనల్ అధికారిని పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ సీఈకి మెమో ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు.
రైల్వేలది ప్రత్యేక పాలన..
దక్షిణ మధ్య రైల్వే అధికారుల తీరు తమది ప్రత్యేక దేశం, ప్రత్యేక పరిపాలన అనే తరహాలో ఉందని ఎంపీ నామా ఫైరయ్యారు. రాముడు కొలువైన భద్రాచలానికి రైలు సౌకర్యం కల్పించడంపై కేంద్రానికి ఆసక్తి లేదని విమర్శించారు. సత్తుపల్లి, భద్రాచలం లైన్‌కు భూమి ఇవ్వడంతో పాటు కాస్ట్ షేరింగ్ కంటే ఎక్కువగా నిధులు ఇచ్చిన సింగరేణి కాలరీస్‌కు చెప్పకుండానే రైల్వే లైన్ ను ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మీటింగ్ కు వచ్చిన రైల్వే అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో, త్వరలోనే హైదరాబాద్‌లో జీఎం స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు.
అవార్డు ఎందుకు రావట్లే..
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా జరుగుతున్న పనులను డీఆర్డీవో విద్యాచందన వివరిస్తుండగా మంత్రి అజయ్ జోక్యం చేసుకున్నారు. స్వచ్ఛభారత్ ర్యాంకుల్లో ఖమ్మానికి ర్యాంకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. షార్ట్ ఫిల్మ్ విభాగంలో నూకాలంపాడుకు జాతీయ అవార్డు వచ్చిందని చెప్పగా, పట్టణాల్లో స్వచ్ఛభారత్ పై మరింత ఫోకస్ చేయాలని మంత్రి సూచించారు. విద్యుత్ శాఖ సిబ్బందిపై పలువురు ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆసుపత్రుల పనితీరును డీఎంహెచ్‌వో వివరించగా, ఎంపీ నామా అభినందించారు.