సింగరేణిలో మారు పేర్ల కార్మికుల డిపెండెంట్ల పోరు యాత్ర

సింగరేణిలో మారు పేర్ల కార్మికుల డిపెండెంట్ల పోరు యాత్ర
  • వారసత్వ జాబ్ లకు అడ్డంకిగా విజిలెన్స్ రిపోర్ట్
  • రేపటి నుంచి బెల్లంపల్లి రీజియన్ లో యాత్ర షురూ 
  • డిపెండెంట్లకు ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోని కేసీఆర్​

కోల్​బెల్ట్/గోదావరిఖని,వెలుగు: సింగరేణిలో ఇంటి పేర్లతో.. మారుపేర్లతో పని చేసి రిటైర్డ్ అయిన కార్మికుల వారసులు పోరుబాట పట్టారు. తమకు జాబ్ లు కల్పించాలని కోరుతూ సోమవారం నుంచి యాత్రకు రెడీ అయ్యారు.  ఆసిఫాబాద్​జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని గోలేటి నుంచి మొదలై సింగరేణివ్యాప్తంగా తీయనున్నారు.  తమ పేర్లలో మార్పులు చేసి రెగ్యులరైజ్ చేయాలని కార్మికులు ఏండ్లుగా కోరుతున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు. 

రిటైర్డ్ అయినా, అనారోగ్యానికి గురైనా వారసులకు జాబ్ చాన్స్ ఉన్నా.. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్టు అడ్డంకిగా మారిం ది. కార్మికుల్లో ఇంటి పేర్లు, అసలు పేర్లు కాకుండా మారు పేర్లతో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండగా రికార్డుల్లో సరి చేసుకోలేదు. 2017 ముందు వరకు అలియాస్​పేరిట జాబ్ చేసేవారిపై సింగరేణి విజిలెన్స్​కు ఫిర్యాదు వెళ్లాయి. దీంతో ఎంక్వైరీలో 200 మంది జాబ్ లు కోల్పోయారు. మరో100 మంది డిస్మిస్​అయ్యారు. 

ఇప్పటికీ ఎంక్వైరీ పెండింగ్​తో  వేల మంది వారసులకు సింగరేణి జాబ్స్ ఇవ్వడంలేదు. కార్మికుల్లో 30 - – 35శాతం మంది ఏండ్లుగా పని చేస్తుండగా.. వారంతా అసలు పేర్లతో పని చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని 2017 అక్టోబర్​8న ప్రగతిభవన్​నుంచి సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్​గెలిచిన సందర్భంగా  కేసీఆర్​హామీ ఇచ్చారు. దీంతో అధికారులు అప్లికేషన్లు తీసుకోగా.. సుమారు 14 వేల మంది అప్లై చేసుకున్నారు.  బీఆర్ఎస్ హయాంలో జాబ్ లు కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో చివరకు నిరాశే ఎదురైంది. 

రిటైర్డ్ మెంట్ ఏజ్ కు చేరగా.. 

  ఇప్పటికీ కార్మికులు పేర్లమార్పుకు ఎదురు చూస్తుండగా.. అంతా రిటైర్డ్ మెంట్ ఏజ్ కు చేరారు. తమ పిల్లలకైనా జాబ్ ఇప్పించేందుకు అప్లికేషన్​పెట్టుకుందామంటే వీలుకాని పరిస్థితి.  దీంతో వారసత్వ నియామకాలకు అడ్డంకిగా మారింది. రికార్డుల్లో తండ్రి కొడుకుల పేర్లు సరిగా ఉన్నా.. విజిలెన్స్​ఎంక్వైరీ పేరిట అభ్యంతరాలు తెలుపుతూ వారసత్వ జాబ్ లు ఇవ్వడంలేదు. మరోవైపు చాలా మంది కొంతకాలం జాబ్ చేసిన తర్వాత కూడా విజిలెన్స్​ ఎంక్వైరీలో పేర తొలగించారు.  తమ పేర్లు సవరించి వారసులకు జాబ్ ఇవ్వాలని డిమాండ్​చేస్తూ డిపెండెంట్లు ఏండ్లుగా మంత్రులు, సింగరేణి ఉన్నతాధికారులు,  అన్ని కార్మిక సంఘాలకు చెప్పుకున్నా నిరాశే మిగిలింది.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా సానుకూ లంగా స్పందించి వన్ టైమ్​సెటిల్ మెంట్ కింద జాబ్ లు కేటాయించాలని డిపెండెంట్లు కోరుతున్నారు.