- ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు చేయలే: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ప్రభుత్వానికి ఏడాది టైం ఇవ్వాలనే ఇన్ని రోజులు ఆగినం
- నవంబర్ 1 నుంచి నిలదీస్తాం
- రేవంత్‌ది తలా తోకలేని పాలన అని మండిపాటు
వరంగల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం నవంబర్ 1 నుంచి పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు ఆగామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్‌రెడ్డి సోమవారం తొలిసారి వరంగల్‌లో పర్యటించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పార్టీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సభ్యత్వ నమోదును సమీక్షించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిందన్నారు. కేసీఆర్ పదేండ్లకుటుంబ పాలనతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధోగతి పాలు చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలాతోక లేని అస్తవ్యస్త పాలన కొనసాగిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. ఆర్థిక వనరులు ఎలా సమీకరించుకోవాలన్న ప్రణాళిక ప్రభుత్వానికి లేదన్నారు. ‘‘రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్సర్కార్చెప్తోంది. అక్క డ బంగారం చెట్లేమైన పెడ్తరా.. గోల్డ్‌తో, వాటర్‌తో సుందరీకరణ చేస్తార?’’ అని ఎద్దేవా చేశారు. గండిపేట నుంచి నల్గొండ వరకు వేల కాలనీల మురుగు మూసీలో కలుస్తోందని, ఆ నదిని ఎలా శుద్ధి చేస్తారో చెప్పే డీపీఆర్ కూడా లేదన్నారు. ఇక పార్టీ ఫిరాయింపుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ఒక్కటేనని కిషన్ మండిపడ్డారు. గతంలో సబిత కాంగ్రెస్ తరఫున గెలిచి.. బీఆర్ఎస్ సర్కారులో మంత్రి అయ్యారని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్లోచేరారన్నారు.
సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనే లేదు..
సింగరేణిని ప్రైవేటీకరించాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశపై తీర్మానం చేసే పవర్ తమకు లేదని, 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నందున బోర్డులో వారే తీర్మానం చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన మైన్స్‌ను సింగరేణికి, ఏఎంఆర్ కంపెనీకి ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. కిషన్ వెంట పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తదితరులు ఉన్నారు.