చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​కు నిరసన సెగ

కొడిమ్యాల, వెలుగు : చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్​కు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామంలో సోమవారం ప్రచారంలో భాగంగా రవి శంకర్ పాల్గొన్నారు. ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘం నాయకులు ఆయనను అడ్డుకున్నారు. ఐదేండ్లవుతున్నా నాలుగు గ్రామాల ప్రజలకు సాగునీరందించే కాల్వ పనులను ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సాక్షాత్తూ ముగ్గురు మంత్రులు హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. సాగునీరు లేక తమకు చావే దిక్కని ఉరితాడుతో నిరసన తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. గొడవ జరుగుతుండడంతో పోలీసులు 20 మంది కేంద్ర బలగాలను గ్రామంలో మెహరించారు. స్థానిక సీఐ కోటేశ్వర్, ఎస్ఐ వెంకట్రావ్ లు నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బెదిరించి, నెట్టివేసిన సీఐపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన ఎమ్మెల్యే... పోచమ్మ మీద ఒట్టు పెట్టి తాను గెలిచిన నెల రోజుల్లో కాల్వ పనులు ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు.