యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయాలన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. చుట్టూ ఉన్న 14 గ్రామాలను కలిపి మండలం చేయాలనే డిమాండ్‌తో గ్రామస్తులు చేపట్టిన రిలే దీక్షలు గురువారంతో 100వ రోజుకు చేరుకున్నాయి. దీంతో గ్రామస్తులంతా గురువారం కలెక్టరేట్‌కు వచ్చి ధర్నాకు దిగారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు యాదగిరిగుట్టలో స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
హాస్పిటల్‌లో సౌలత్‌లు కల్పిస్తాం
కోదాడ, వెలుగు : కోదాడలోని ప్రభుత్వ హాస్పిటల్‌ను అభివృ-ద్ధి చేసి, రోగులకు అవసరమైన సౌలత్‌లు కల్పిస్తామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చెప్పారు. గురువారం ప్రభుత్వ హాస్పిటల్‌లో జరిగిన అభివృద్ధి కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. హాస్పిటల్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హాస్పిటల్స్‌కు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం కోదాడ సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ రజనీ, డాక్టర్లు కరుణ్, విజయ్, కె.సురేశ్, నాయకులు బుర్ర సుధారాణి, వెంపటి మధుసూదన్, చందు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్స్ అప్లై చేసుకోండి
యాదాద్రి, వెలుగు : జాతీయ గుర్తింపు పత్రం కోసం ట్రాన్స్‌జెండర్స్ అప్లై చేసుకోవాలని యాదాద్రి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణవేణి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. http://transgender.dosje.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. గుర్తింపు పత్రం పొందిన వారు ఆర్థిక పునరావాస పథకం కోసం ఆఫీస్‌లో సంప్రదించాలని సూచించారు. అలాగే ‘రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డ్స్2022’ కోసం అర్హత గల వారు ఈ నెల 21లోపు తమ ఆఫీస్‌లో అప్లై చేసుకోవాలని పేర్కొన్నారు.
‘ప్రత్యేక’ పరికరాలను వినియోగించుకోవాలి
యాదాద్రి, వెలుగు : ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందించే పరికరాలను వినియోగించుకోవాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సమగ్ర శిక్ష తెలంగాణ, అలింకో కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. మొత్తం 360 మంది చిన్నారులకు పరీక్షించి వారి అవసరానికి అనుగుణంగా హియరింగ్ ఎయిడ్స్, ట్రై సైకిల్స్, వీల్‌చైర్స్, రోలెటర్స్, క్రచెస్, సీపీ చైర్స్, కాలిపర్స్ అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్యాంప్‌ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 20 భవిత కేంద్రాల్లో పిల్లలకు చదువుతో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీతో పాటు వారి పనులు వారే చేసుకునేలా ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో నారాయణరెడ్డి, అలింకో కార్పొరేషన్ డాక్టర్లు డాక్టర్లు శ్వేత, రవికుమార్, అభినవ్, భువనగిరి ఏరియా హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసరావు, కో -ఆర్డినేటర్ జోసఫ్, ఎంఈవో లక్ష్మీనారాయణ ఉన్నారు.
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
యాదగిరిగుట్ట, వెలుగు : రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగితేనే హక్కులను సాధించుకునే అవకాశం ఉంటుందన్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఈడబ్ల్యూసీ పేరుతో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధం ఉందన్నారు. ఈడబ్ల్యూసీ వల్ల మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకున్నాయన్నారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. బీసీలను చైతన్యవంతం చేయడం కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బస్సు యాత్ర చేపట్టి, ఢిల్లీ రాంలీలా గ్రౌండ్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీసీలకు 56 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గుండు జ్యోతి, నాయకులు మధు, ఎరుకల వెంకటేశ్‌గౌడ్, గుండు నర్సింహగౌడ్, బొజ్జ సాంబేశ్, మొలుగు నర్సింహ, బండి వాసు పాల్గొన్నారు.
గీత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
మహాసభల పాంప్లెంట్ ఆవిష్కరణ
రైతు సంఘం సభలను సక్సెస్ చేయాలి
కోదాడ, వెలుగు : నల్గొండలో ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రైతు సంఘం మహాసభలను సక్సెస్ చేయాలని సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి కోరారు. కోదాడ పట్టణంలోని సుందరయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన ముఖ్య నాయకుల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మహాసభలకు సూర్యాపేట జిల్లా నుంచి 10 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా పార్లమెంట్‌లో చట్టం చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మట్టిపెళ్లి సైదులు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మిట్టగడుపుల ముత్యాలు, బెల్లంకొండ సత్యనారాయణ, ఏనుగుల వీరాంజనేయులు, బీరవెల్లి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నారసింహుడిని దర్శించుకున్న కేంద్రమంత్రి
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని గురువారం కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. గుట్టకు వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపం వద్ద అర్చకులు వేదాశీర్వచనం చేయగా, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కరశర్మ స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌ను ఖతం చేసి, తెలంగాణలో పారదర్శకమైన బీజేపీ పాలన అందిస్తామన్నారు. ఎనిమిదేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శించారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడి ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రచ్చ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్, ట్రెజరర్ కాదూరి అచ్చయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
భిక్షమయ్యను పరామర్శించిన గుంటకండ్ల
యాదాద్రి, వెలుగు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ తండ్రి సోమయ్య దశదినకర్మను గురువారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం పారుపల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హాజరై సోమయ్య ఫొటో వద్ద నివాళి అర్పించారు. అనంతరం భిక్షమయ్యగౌడ్‌ను పరామర్శించారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి ఉన్నారు.